మ‌ట్టిబిడ్డ‌ల‌ బ‌తుక‌మ్మ‌..!

చ‌రిత్ర మ‌రిచి పోతున్నం
చెమ్మ‌గిల్లిన క‌న్నీళ్ల సాక్షిగా
ఈ మ‌ట్టికి ఎన‌లేని క‌థ వున్న‌ది
అది కొన్నేళ్ల పోరాటం..ఎడ‌తెగ‌ని ఆరాటాల్ని 
పొదివి ప‌ట్టుకుని ఎగ‌సి ప‌డిన దృశ్యం
స‌జీవ రూప‌మై నిటారుగా నిల‌బ‌డ్డ‌ది
అది స‌గ‌ర్వంగా ప్ర‌పంచానికి తానేమిటో చాటి చెప్పింది
ఉద్య‌మ‌మై ఎగ‌సి ప‌డ్డ‌ది ..ఊపిరై బిడ్డ‌ల్ని పొదివి ప‌ట్టుకుంది
అది కోట్లాది గొంతుక‌ల్లో మాటై మోగింది
పాటై జ‌త క‌ట్టింది..జాత‌రై..పెను ఉప్పెనై చుట్టేసింది
అదే నా బ‌తుక‌మ్మ‌..ఆత్మ‌గౌర‌వం కోసం సాగిన ప్ర‌స్థానానికి
ప్ర‌తిరూపంగా నేడు దిగంతాల‌ను దేదీప్య‌మానంగా వెలుగొందేలా
విస్మ‌రించ లేనంత‌గా ఎదిగిపోయింది..
ఎన్ని కుట్ర‌లు..ఎన్ని కుతంత్రాలు..ఎన్ని ఛీత్కారాలు
అన్నీ కోల్పోయిన చోట..నిలువ నీడ లేకుండా పోయిన చోట
మ‌ళ్లీ ఫీనిక్స్ ప‌క్షి లాగా ..జ‌నం జెండాగా మారి ..కాల‌ర్ ఎగ‌రేసిన తీరు
ఎంద‌రికో స్ఫూర్తినిచ్చింది..ప్ర‌జా స్వ‌రానికి ప్రాణం పోసింది..
వెకిలి వేషాలు..ద్వంద‌ర్థాల మాయల ప‌డిపోతున్న త‌రుణంలో
బ‌తుక‌మ్మ సంద్ర‌మై చుట్టుముట్టింది..లోకాన్ని త‌నలో ఇముడ్చుకుంది
కోటి గొంతుక‌ల రాగ‌మై ..గుండెల్ని పిండేసింది..
అందుకే ఈ జాగ‌ల ద‌మ్ముంది..
ఈ మ‌ట్టిల మ‌నుషుల బంధం పెన వేసుకున్న‌ది
తూటాల‌ను దాటుకుని..తుపాకుల‌ను ఎదుర్కొని
కుట్ర‌ల‌ను బ‌ట్ట‌బ‌య‌లు చేసి ..ఎలుగెత్తి నిల‌బ‌డ్డ‌ది
ప్ర‌పంచ ప‌టం మీద నా తెలంగాణ
కోటి గొంతుక‌ల వీణై మోగింది ..ద‌రువై దుమ్ము రేపింది
ఏళ్లయినా..త‌రాలు గ‌డిచినా..డాల‌ర్ల మాయాజాలం చేసినా..
అమెరికా మోజులో ప‌డినా..స‌రే తెలంగాణ బ‌తుకు సిత్రం మార‌లే..
బ‌తుక‌మ్మై ఊరూరా ఉర‌క‌లెత్తుతోంది..ప‌ల్లెప‌ల్లెన పాట‌లు పాడుతోంది
అలయ్ బ‌ల‌య్ అంటూ ..పీర్ల పండుగ‌ను త‌ల‌పింప చేస్తోంది..
ఆడ‌బిడ్డ‌లారా ఆడండి..బ‌తుక‌మ్మ‌లై మీకు మీరే సాటి అని చాటండి..!

కామెంట్‌లు