ఆర్టీసీ సమ్మె సైరన్..సంఘాల అల్టిమేటం..!

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన కార్మిక, ఉద్యోగ సంఘాల నేతలు ఎండీకి, యాజమాన్యానికి నోటీసులు అందజేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో ఆర్టీసీకి చెందిన కార్మికులు, సిబ్బంది, ఉద్యోగులు పూర్తి స్థాయిలో పాల్గొన్నారు. సకల జనుల సమ్మెలో వారు ముందంజలో నిలిచారు. రాష్ట్రం ఏర్పాటు అయ్యాక ఉద్యోగులను కడుపులో పెట్టుకుని చూసుకుంటానని సీఎం కేసీఆర్ చెప్పారు. ఇదే సంస్థకు రిటైర్డ్ ఉద్యోగులు గుదిబండగా మారారు. అంతే కాకుండా అద్దె బస్సుల దందా కూడా సంస్థకు భారంగా మారింది. ఉమ్మడి రాష్ట్రంలో గత పాలకులు అతి పెద్ద సంస్థను నిర్వీర్యం చేశారు. ప్రైవేట్ ఆపేటర్లకు బార్లా తెరిచారు. కాలం చెల్లిన బస్సులు ఇంకా నడుపుతూ ప్రయాణీకుల, ఉద్యోగుల ప్రాణాలతో సంస్థ ఆటాడుకుంటోంది. గతంలో సీఎం అల్లుడు హరీష్ రావు టీఎంయూ సంఘానికి గౌరవ అధ్యక్షుడిగా ఉన్నారు. తర్వాత దాని నుండి వైదొలిగారు.

ఇదే సమయంలో తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, సంస్థను టేకోవర్ చేసుకోవాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు కార్మికులు . సంస్థ అప్పుల్లో ఉందని, దానిని మీరే కాపాడు కోవాలని ఇటీవల సీఎం ప్రకటించారు. దీనిపై ఆర్టీసీ కార్మికులు మండి పడ్డారు. తెలంగాణలోని అన్ని డిపోల ఎదుట ఆందోళనలు చేపట్టారు. అయినా యాజమాన్యం, ప్రభుత్వం కనీసం స్పందించ లేదు. 3 వేల కోట్లకు పైగా అప్పులు పేరుకు పోయాయని, దీని నిర్వహణ ఇక కష్టమంటూ స్పష్టం చేసింది. అయితే మెట్రో కోసం వేల కోట్లు అప్పులు తెచ్చిన ప్రభుత్వం 24 గంటలు ప్రజలకు సేవలందిస్తున్న తమ సంస్థను ఎందుకు పట్టించు కోవడం లేదంటూ కార్మికులు ప్రశ్నిస్తున్నారు. వచ్చిన ఆదాయంలో ఎక్కువ శాతం ఉద్యోగుల జీతాలకు, సంస్థ నిర్వహణకు పోతోంది. దీంతో అప్పులు పెరిగి పోతున్నాయి. ఆర్టీసీకి రావాల్సిన నిధులు చెల్లించడం ఆగి పోయాయి. మెట్రోతో అనుసంధానం చేస్తే కొంచం మెరుగయ్యే ఛాన్స్ ఉంది. అద్దె బస్సులను తొలగించాలి. రోడ్ ట్యాక్స్ తగ్గించాలి. డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గించాలి.

అంతే కాకుండా తెలంగాణ ఆర్టీసీకి భారీ ఎత్తున ఆస్తులు ఉన్నాయి. సంస్థను ప్రభుత్వం ఓన్ చేసుకుంటే ఈ ఆస్తులను తనఖా పెట్టయినా లేదా లీజుకు ఇచ్చినట్లయితే ఈ అప్పులను తీర్చవచ్చు అంటున్నారు ఆర్టీసీ సంఘాల నాయకులు. ఈరోజు వరకు పల్లెలకు పూర్తి స్థాయిలో బస్సులు నడపలేని స్థితిలో ఆర్టీసీ ఉన్నది. ఇప్పటికే నష్టాల్లో ఉన్న సంస్థను గట్టెంక్కించాల్సిన ప్రభుత్వం చూసీ చూడనట్లు వ్యవహరిస్తోందని కార్మికులు వాపోతున్నారు. ఒకవేళ సమ్మెకు దిగితే నిత్యం రోజూ ప్రయాణం చేసే వేలాది మంది ప్రయాణికులకు ఇబ్బందులు తప్పేలా లేవు. మరో వైపు 6 వేల కోట్ల రూపాయల అప్పులున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను అక్కడి ప్రభుత్వం విలీనం చేసుకుంది. ఇక సంస్థలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు ప్రభుత్వ ఉద్యోగులేనని స్పష్టం చేసింది. ఎక్కువ ఆస్తులు ఉండి, తక్కువ అప్పులు కలిగిన టీఎస్ ఆర్టీసీని ఎందుకు ఈ ప్రభుత్వం విలీనం చేసుకోవడం లేదని నిలదీస్తున్నారు. తాజాగా ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో ఆర్టీసీకి నిధులు కేటాయించ లేదు. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!