దునియా అంతట మన విస్కీనే - ఆఫీసర్స్ ఛాయిస్‌కే అందరి ఓటు
క్యా బాత్ హై..దునియా అంతట మన విస్కీనే తాగుతున్నరట. భలేగుంది కదూ ముచ్చట. ఇప్పటికే గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఎండల దెబ్బకు చల్లంగ ఉంటదని బీరు, బ్రాంది, విస్కీ, కల్లు, సారాను మస్తుగ తాగిండ్రు. ఏకంగా 20 వేల కోట్లకు పైగా ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన మందు బాబులు ఖర్చు చేసిండ్రు. వారెవ్వా..బతకనీకె పైసలు లేకపాయె కానీ తాగనీకె..తందానాలు ఆడనీకె మస్తుగ ఖర్చు బెడుతుండ్రు. ఎక్కడ పడితే అక్కడ..ఏడ పడితే ఆడ తాగే దుక్నంలు ఉండబట్టె. ఇంక తాగుడే తాగుడు..దుంకుడే దుంకుడు. ఆదాయం ఫుల్‌గా వస్తుందని సర్కారే టైమ్ స్లాట్ ఎత్తేసింది. ఏం చేయక పోయినా పర్వాలేదు.
తాగనైతే తాగుండ్రి. భార్యలను కొట్టుండ్రి. మీ పాణం ఆగమైతే మాకే కద ఆదాయం అంటున్నయి ప్రైవేట్ దవఖానాలు. తుమ్మితే చాలు టెస్టులు, కింద పడితే చాలు.ఎక్స్‌రేలు..చూస్తేనే పాణం పోయేటట్లు ఉంటది. దాంట్లకు పోతే పాణం సల్లగుంటదనుకుంటే ..బిల్లలు మోతతో లబోదిబోమనే కాలం వచ్చె. గిది గిట్ల వుంటే..మనకాడ తయారైన విస్కి మస్తు మజా ఇస్తుందని దునియా అంతటా గిదే కావాలని అడుగుతుండ్రంట. అబ్బ ఏం తెలంగాణరా బై. చెప్పుకుంటే నవ్వాలో ఏడ్వాలో తెలుస్తలేదు. పొద్దుగాల్గ లేసినకాడి నుంచి కళ్లు మూసుకునే దాకా తాగడమే. లోకమంతటా అమ్ముడైన బ్రాండ్లలో మన బ్రాండ్ విస్కీ ఒకటని తేలింది.
ఇంకేం తెలంగాణ సర్కార్ కు ఈ రకంగా పేరు రాబట్టె. గిట్లనన్న సంతోషపడుదం తీయండ్రి. కొలువులు వస్తయని, పెండ్లిల్లు అయివతని కలలు కంటే..బిడ్డల పాణం పైపైనే పోతున్నట్లుంది. వయసు ఉడిగి పోతుంటే..శరీరం మడతలు పట్టబట్టె. ఇగ పిల్లను ఎవరిస్తరు. మా పిల్ల మాతోనే ఉంటదంటున్నరు ఊర్లల్ల. మేడిన్ ఇండియా పేరుంటే చాలు ఎన్నారైలు, ఫారినర్స్ అంతా విస్కీ..విస్కీ అని పలువరిస్తున్నరట. గీ వార్త ఆ నోట ఈ నోట తెలుసుకుని మందుప్రియులు మస్తు ఎంజాయ్ చేస్తున్నరట. అన్నిటి కాడ విస్కీకి జై అంటున్నరట. 2018లో గ్లోబల్‌గా అమ్ముడు పోయిన ఐదు విస్కీ కేసులలో మూడు మనవే ఉన్నయంటే ..మన రేంజ్ ఏందో అర్థం చేసుకోండ్రి.
మన విస్కీ పేరు తెలుసు కద..అదే ఆఫీసర్స్ ఛాయిస్. ఇంటర్నేషనల్ వైన్ అండ్ స్పిరిట్ రీసెర్చ్ చేసిన సర్వేలో గీ వార్త బయట పడ్డది. మన విస్కీకి ఇంత డిమాండ్ ఉందని తెలుసుకుని ముసి ముసి నవ్వులు నవ్వుతుండ్రు దుక్నం దారులు.
3.4 కోట్ల కేసులు అమ్ముడు పోయి ఆఫీసర్స్ ఛాయిస్ బ్రాండ్ రికార్డు సృష్టించింది. గత నాలుగేళ్లుగా 11 శాతానికి పైగా అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. మిగతా బ్రాండ్స్ 11 లక్షల కేసులు పోతే..ఇదొక్కటే అత్యధికంగా అమ్ముడు పోవడం ఇతర కంట్రీస్‌ను ఆశ్చర్య పోయేలా చేసింది. ఇంకేముంది మన విస్కీనే కదా..తాగండి..ఊగండి..హరే రామ హరే కృష్ణ అంటూ పాడండి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి