కాఫీపై క‌న్నేసిన కోలా..!

ప్ర‌పంచ వ్యాప్తంగా అతి పెద్ద పానీయాల సంస్థ‌ల‌లో నెంబ‌ర్ వ‌న్‌గా ఉన్న కోకాకోలా కంపెనీ తాజాగా కాఫీ రంగంలోకి ఎంట‌ర్ అయ్యేందుకు పావులు క‌దుపుతోంది. ఈ మేర‌కు ఆయా దేశాల‌లోని ఏయే ప్రాంతాల్లో కాఫీ పంట‌, సాగు, మార్కెటింగ్ అవుతుందో దృష్టి సారించింది. త‌న అనుచ‌ర వ‌ర్గంతో జ‌ల్లెడ ప‌డుతోంది. లోక‌మంత‌టా నీళ్లు దొర‌క‌వేమో కానీ కోలా, పెప్సీ కంపెనీల‌కు చెందిన కూల్ డ్రింక్స్ దొరక‌డం స‌హ‌జం. అంత‌లా వ‌ర‌ల్డ్ మార్కెట్‌పై త‌మ ప‌ట్టు నిలుపుకునేందుకు కృషి చేస్తున్నాయి. గ‌త 10 నెల‌ల కింద‌ట బ్రిట‌న్‌కు చెందిన కోస్టా కాఫీని 5.1 బిలియ‌న్ డాల‌ర్ల‌తో స్వంతం చేసుకుంది కొకో కోలా కంపెనీ. తాజాగా ఇండియాలో అత్యంత పేరొందిన ఫ్లేవ‌ర్‌గా కేఫ్ కాఫీ డేలో వాటా చేజిక్కించుకునేందుకు ప్ర‌య‌త్నాలు ప్రారంభించింది. 

బెంగ‌ళూరు కేంద్రంగా ఉన్న ఈ కంపెనీ యాజ‌మాన్యంతో ప్రాథ‌మిక చ‌ర్చ‌లు జ‌రిపిన‌ట్లు స‌మాచారం. ఈ ఏడాది ప్రారంభంలో మైండ్ ట్రీలో త‌న‌కున్న వాటాను కేఫ్ కాఫీ డే వ్య‌వ‌స్థాప‌కుడు వీజీ సిద్ధార్థ విక్ర‌యించారు. కొకో కోలా సౌత్ వెస్ట్ ఏషియా ప్రెసిడెంట్ , చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్ టి. కృష్ణ కుమార్ ప్ర‌స్తుతం అట్లాంటాలో వుంటూ ఈ చ‌ర్చ‌ల్లో పాల్గొంటున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. కీల‌క ద‌శ‌లో కంపెనీకి సంబంధించిన కొనుగోలు వ్య‌వ‌హారాల‌పై స్పందించ‌డం భావ్యం కాదంటూ కేఫ్ కాఫీ డే కంపెనీకి చెందిన ప్ర‌తినిధులు వెల్ల‌డించారు. ఈ ఏడాది మార్చి నెలాఖ‌రు నాటికి కాఫీ డే ఎంట‌ర్ ప్రైజెస్ సంస్థ‌కు 6 వేల 547 కోట్ల రూపాయ‌ల అప్పులు ఉన్నాయి. దీంతో వాటాల విక్ర‌యం కోసం వివిధ విదేశీ కంపెనీల‌తో చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. అయితే ఈ కంపెనీ నిక‌ర వాల్యూ మాత్రం 2 వేల 529 కోట్లుగా వుంది. ఉద‌యం నుంచి ప‌డుకునేంత వ‌ర‌కు టీ లేదా కాఫీ తాగ‌డం అల‌వాటు. వాటిని తాగ‌కుండా విధుల్లోకి, ప‌నుల్లోకి వెళ్ల‌లేని ప‌రిస్థితి. ఈ ఫ్లేవర్ల వ్యాపారం బిలియ‌న్ డాల‌ర్ల‌ను ఎప్పుడో దాటేసింది. 

ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌తి దేశంలోని మారు మూల ప‌ట్ట‌ణాలు, గ్రామాల్లో సైతం వీటికి సంబంధించిన హోట‌ళ్లు, కెఫేలు, రెస్టారెంట్లు ఉన్నాయి. ప్ర‌త్యేకించి 50 నుంచి 100 ఫ్లేవ‌ర్లు కొలువు తీరి వున్నాయి. వీటికంత డిమాండ్. తేయాకు, కాఫీ పంట‌ల‌ను క‌ర్ణాట‌క‌లో ఎక్కువ‌గా పండిస్తారు. ఎగుమ‌తులు, దిగుమ‌తుల ప‌రంగా చూస్తే కోట్లాది రూపాయ‌లు వ‌స్తున్నాయి. ఈ పంట‌ల సాగు మీద ఆధార‌ప‌డి వేలాది మంది బ‌తుకుతున్నారు. వీటి డిమాండ్‌ను దృష్టిలో వుంచుకుని 1996లో అంటే 23 ఏళ్ల కింద‌ట విట్ట‌ల్ మాల్యా రోడ్ లోని బెంగ‌ళూరులో ఈ కంపెనీని స్థాపించారు. 2015 అక్టోబ‌ర్ 17 నాటికి దేశ , విదేశాల్లో 1556 కేంద్రాలు ఉన్నాయి. వి.జి. సిద్ధార్థ ఈ కంపెనీకి ఛైర్మ‌న్‌గా వున్నారు. కాఫీ వ్యాపారంతో ప్ర‌తి ఏటా 13.26 బిలియ‌న్ల ఆదాయం స‌మ‌కూరుతోంది ఈ కంపెనీకి. అందుకే ప్ర‌పంచ వ్యాప్తంగా బిగ్ నెట్‌వ‌ర్క్ క‌లిగిన కోలా కంపెనీ దీనిపై క‌న్నేసింది.

కామెంట్‌లు