సంతాపం సరే..పరిహారం మాటేమిటి..?
ఇంటర్ బోర్డులో నెలకొన్న గందరగోళం కంటిన్యూ అవుతూనే వుంది. సింపుల్‌గా సంతాపం ప్రకటించారు సీఎం కేసీఆర్. 20 మందికి పైగా పిల్లలు ఆత్మహత్యలకు పాల్పడితే..పరిహారం ఊసెత్తలేదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏ ఒక్క పరీక్షను సక్రమంగా నిర్వహించిన పాపాన పోలేదు. విద్యా వ్యవస్థ పూర్తిగా గాడి తప్పింది. ఎవరు ఏం మాట్లాడుతున్నారో తెలియడం లేదు. ఉన్నతాధికారులు బాధ్యతా రాహిత్యంగా మాట్లాడుతున్నారు. తమకు అన్యాయం జరిగిందంటూ శాంతియుతంగా ఆందోళన చేపట్టిన స్టూడెంట్స్, పేరెంట్స్ పట్ల పోలీసుల అనుసరించిన తీరు గర్హనీయం. ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జనార్దన్ రెడ్డిలు పిల్లల పట్ల నిర్దాక్షిణ్యంగా వ్యవహరించడంపై ఆగ్రహం వ్యక్తమైంది. ఎలాంటి అనుభవం లేనటువంటి గ్లోబరినా సంస్థకు పరీక్షల నిర్వహణ అప్పగించడం వెనుక ఎంత మంది చేతులు మారాయో బయట పడాల్సిన అవసరం ఉంది. వందలాది మంది విద్యార్థులు బాగా చదివినా మార్కులు పొందలేక పోయారు. దీనిని సీరియస్‌గా ప్రభుత్వం తీసుకోక పోవడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది.
ఫెయిల్ అయిన విద్యార్థ/లకు రుసుములు ఉండవని సెలవిచ్చారు. అసలు పిల్లలకు భరోసా ఇవ్వాల్సిన సంబంధిత శాఖ మంత్రి విపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయంటూ చెప్పడం విడ్డూరం. మొదటిసారి మంత్రివర్గంలో చేరిన ఆయనకు విద్యా శాఖ అప్పగించారు. దానిని సరిగా మేనేజ్ చేయలేక పోయారు. దీంతో ఆయన నుంచి కేసీఆర్ శాఖ తీసేసి కడియం శ్రీహరికి అప్పగించారు. మళ్లీ జరిగిన ఎన్నికల తర్వాత ఏర్పడిన సర్కార్‌లో తిరిగి ఫెయిల్ అయిన మంత్రికి అదే శాఖను అప్పజెప్పడంపై అభ్యంతరం వ్యక్తమైంది. దేశ వ్యాప్తంగా, రాష్ట్రంలో నిర్వహించే పరీక్షలకు ఇంటర్ లో వచ్చిన మార్కులే ప్రాతిపదిక. ఎంసెట్, నీట్, జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్ ..ఇలా అన్ని పరీక్షలకు మార్కులే కొలమానం. ఓ వైపు మార్కుల గందరగోళం ఇంకో వైపు ఎంట్రెన్సుల హడావుడి విద్యార్థుల పాలిట శాపంగా మారాయి. ఇంత జరుగుతున్నా..పిల్లలు ఇబ్బందులకు లోనవుతున్నా సమస్యను చిన్నదిగా చూస్తున్నారే తప్పా..ఏ ఒక్కరు ముందుకు వచ్చి మీకు మేమున్నామంటూ చెప్పిన పాపాన పోలేదు.
మానసికంగా చితికి పోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారి సంఖ్యలో ఇంతవరకు క్లారిటీ లేదు. వారందరికి కనీసం 25 లక్షల ఎక్స్ గ్రేషియాతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగ భద్రత కల్పించాల్సి ఉండేది. ఈ విషయంపై ప్రకటన చేసి వుంటే కొంత ఉపశమనం కలిగేది. ప్రభుత్వ ఉదాసీన వైఖరిని నిరసిస్తూ విద్యార్థి సంఘాలు, పేరెంట్స్, బాధిత స్టూడెంట్స్, విపక్షాలు ధర్నాలు , ఆందోళనలు చేపట్టారు. త్రిసభ్య కమిటీని కేటీఆర్ ప్రకటించడం ఆశ్చర్యానికి గురి చేసింది. చావుకు గురైన పిల్లల ప్రాణాలను ఎవరు తీసుకు వస్తారు..ఒకసారి పరీక్ష తప్పితే..పాసవ్వొచ్చు..కానీ ప్రాణం అలా కాదే..ఎందుకిలా జరుగుతోంది..ఇవి ముమ్మాటికీ సర్కారు హత్యలుగానే కేసులు నమోదు చేయాలని విద్యార్థులు, మేధావులు కోరుతున్నారు. మిగతా కార్యక్రమాలకు హాజరవుతున్న కేటీఆర్ , హరీష్ రావు, కవితలు ఎందుకని చనిపోయిన విద్యార్థుల కుటుంబాలను పరామర్శించలేక పోయారు..?
అసలు వీళ్లు చేసిన త్యాగాలు, బలిదానాల వల్లనే కదా ఇవాళ అనుభవిస్తున్న తెలంగాణ వచ్చింది. కాంగ్రెస్ ఇచ్చింది. ఇది మరిచి పోతే ఎలా..? ఇప్పటికైనా మించి పోయింది లేదు..ఎవరైతే మనస్థాపంతో..మానసికంగా కృంగి పోయి..కన్నవారికి చెప్పుకోలేక ఆత్మహత్యలకు పాల్పడిన వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ముమ్మాటికీ ఈ సర్కార్‌పైనే ఉన్నది. ఈ ఘోరాలకు బాధ్యులు ఇంటర్, విద్యాశాఖ ఉన్నతాధికారులే. గ్లోబరినా సంస్థ నిర్వాకం వల్లనే మొత్తం జరిగిందని అనుకోవడానికి లేదు. రెండోసారి ఎన్నికైనా ఈరోజు వరకు పూర్తి స్థాయిలో సిబ్బందిని భర్తీ చేసిన దాఖలాలు లేవు. చనిపోయిన పిల్లల ముఖాలు చూడండి. అప్పుడైనా మనసు కరుగుతుందేమో. ఎంత కాలం ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు మన వద్ద ఉండరన్న వాస్తవం గుర్తుంచు కోవాలి. బలవంతపు చావులకు కారకులైన ఉన్నతాధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి జైలుకు తరలించాలి. అప్పుడైతే తిక్క కుదురుతుంది..వారి ఆస్తులపై విచారణ జరిపించాలి.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి