ఈ ఐఏఎస్ జనం మెచ్చిన దేవుడు
ఇండియాలో అత్యున్నతమైన అధికారిక సర్వీసుగా పేరొందిన సివిల్ సర్వీసెస్‌లో ఉత్తమ ప్రతిభను కనబరిచిన వాళ్లు ఎందరో. చాలా మంది ఐఏఎస్‌లుగా పనిచేస్తున్నా కొందరు మాత్రం ప్రజా సేవలో మునిగి తేలుతున్నారు. జనం కోసమే బతుకుతున్నారు. అలాంటి వారిలో మణిపూర్‌కు చెందిన ఆర్మ్ స్ట్రాంగ్ పామే ఒకరు. నాగాలాండ్ ప్రాంతంలోని జేమే తెగకు చెందిన పామే ప్రపంచం తన వైపు చూసేలా పనిచేశాడు. 2015లో దేశంలోనే అత్యుత్తమమైన ఐఏఎస్ అధికారి అవార్డును పొందారు. సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేసిన పామే..2005లో డిల్లీ కేంద్రంగా సివిల్ సర్వీసెస్ పరీక్షకు హాజరయ్యాడు. 2007లో జరిగిన ఎగ్జామ్స్‌లో ఇండియన్ రెవిన్యూ సర్వీసెస్‌కు ఎంపికయ్యాడు. కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్‌లో చేరాడు. 2008లో ఎంపిక చేసిన జాబితాలో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కు సెలెక్ట్ అయ్యాడు.
మనోడు అందరిలాగా అధికారాన్ని చెలాయించలేదు. తన బాధ్యతలేమిటో గుర్తించాడు. తాను ఎందుకు ఉన్నాడో తెలుసుకుని ..తానే అందరికంటే ముందు పని చేయడంలో నిమగ్నమయ్యాడు. మణిపూర్ నుండి నాగాలాండ్ ..అసోం వరకు 100 కిలోమీటర్ల రోడ్డును ఏర్పాటు చేశాడు. కొన్నేళ్లుగా అపరిష్కృతంగా ఉన్న ఈ సమస్యను పామే వచ్చాక తీరింది. తరతరాలుగా ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాల నుండి గట్టెక్కేలా ప్రయత్నం చేశాడు. ఈ అరుదైన కార్యక్రమంలో ప్రజలను భాగం పంచుకున్నారు. పామేకు తమ వంతు సహకారం అందించారు. ఈ రహదారికి పీపుల్స్ రోడ్ అని పేరు పెట్టారు. ఫేస్‌బుక్‌లో రోడ్డు నిర్మాణం కోసం ఒక పేజీని తానే తెరిచాడు. అందులో రహదారి నిర్మాణానికి అవసరమయ్యే డబ్బులు సాయం చేయమని విజ్ఞప్తి చేశాడు. 2012లో 40 లక్షలు సమకూరాయి. ఎందరో ఔత్సాహికులు, మానవతావాదులు తమ వంతు సహకారం అందించారు. దాతలు ఇచ్చిన విరాళాలతో రోడ్డు నిర్మాణం పూర్తి చేశాడు.
ఈ విషయం ఆనోటా ఈనోటా తెలిసింది. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ అరుదైన కార్యక్రమం పూర్తి కావడంతో ప్రజలు పామేను తమ పాలిట దేవుడిగా కొలిచారు. ఎలాంటి సెక్యూరిటీ లేకుండానే ప్రజలతో నేరుగా మాట్లాడడం..వారికి వున్న ఇబ్బందుల గురించి తెలుసుకుంటాడు. ఇదే పామే దినచర్య. ఎలాంటి భేషజాలకు తావీయకుండా ..లో ప్రొఫైల్ మెయింటెనెన్స్ చేస్తూ ప్రజా సేవకుడిగా పేరు తెచ్చుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ యువ ఐఏఎస్ అధికారి చేసిన పని గురించి స్పూర్తి దాయకమైన కథనాలు ప్రచురితమయ్యాయి..ప్రసారమయ్యాయి. కాలిఫోర్నియాలోని ఫేస్ బుక్ కార్యాలయం నిర్వాహకులు ప్రత్యేకంగా పామేను ఆహ్వానించారు. పబ్లిక్ సర్వీస్ కేటగిరిలో ప్రతి ఏటా సిఎన్ఎన్ - ఐబీఎన్ ఇచ్చే ఇండియన్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు 2012లో ఎంపికయ్యాడు. 2015లో మరో అరుదైన ఫీట్ సాధించాడు ఈ ఐఏఎస్.
బిగ్ బి అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా ఆజ్ కి రాత్ హై జిందగీ కార్యక్రమంలో భాగంగా 9వ ఎపిసోడ్‌లో రియల్ హీరో పేరుతో ప్రోగ్రాం టెలికాస్ట్ అయింది. దీనిని స్వంతంగా అమితాబ్ పామేతో మాట్లాడటం విశేషం. బాలీవుడ్ హీరో బొమ్మన్ ఇరానీతో కలిసి స్టార్ టీవీ ప్రసారం చేసిన కార్యక్రమంలో పామే పాల్గొనడం కూడా చరిత్రే. గ్లోబల్ షేపర్స్ కమ్యూనిటీలో సభ్యుడు. ప్రపంచ ఎకనమిక్ ఫోరం 2018లో యంగ్ గ్లోబల్ లీడర్ అవార్డుకు ఆర్మ్ స్ట్రాంగ్ పామేను ఎంపిక చేయడం ఆయనకే కాదు దేశానికి దక్కిన గౌరవంగా భావించాలి. అధికార దర్పంతో ఊరేగుతూ..కింది స్థాయి సిబ్బందిని వేధింపులకు గురి చేస్తూ..రాజకీయ నాయకులకు వత్తాసు పలుకుతూ..ప్రజలను పట్టించుకోకుండా ఆస్తులు పోగేసుకుంటున్న కలెక్టర్లకు చెంపపెట్టు లాంటిది పామే జీవితం. తెలంగాణలో పామే లాంటి ఐఏఎస్‌లు కొన్నేళ్లపాటు పనిచేస్తే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి