శ్రీనివాసం..మహా ప్రసాదం..నిత్య అన్నదానం..! ఎన్టీఆర్..ప్రసాద్‌ల పుణ్య ఫలం !
గోవిందా..గోవిందా..శ్రీనివాసా గోవిందా..ఆపద మొక్కుల వాడా..గోవిందా..అనాధ రక్షకా గోవిందా..ఎక్కడ చూసినా..ఏ మెట్లు ఎక్కినా ..ఆ అపురూపమైన శ్రీనివాసుడే. తిరుమల..తిరుపతి లక్షలాది భక్తుల భగవన్నామ స్మరణతో మార్మోమ్రోగుతూనే వున్నాయి. పేదలు..ధనికులు..అన్ని రంగాలకు చెందిన లబ్ధ ప్రతిష్టులు..సంస్థల అధిపతులు..ప్రపంచం..మెచ్చిన..మహానుభావులు..అనామకులు..అనాధలు..వృద్ధులు..పిల్లలు..దివ్యాంగులు..మహిళలు..అప్పుడే కళ్లు తెరిచిన చిన్నారులు..ఇలా వేలాది మంది నిత్యం ఆ తిరుమల కొండపై వెలసిన శ్రీనివాసుడిని చూసేందుకు తండోప తండాలుగా వస్తూనే వుంటారు. ప్రతి రోజూ శ్రీ వేంకటేశ్వర స్వామితో పాటు అలివేలు మంగమ్మలకు నభూతో నభవిష్యత్ అన్న రీతిలో పూజలు జరుగుతాయి.
గాలిమోటార్లు, వాహనాలు, బస్సులు, రైళ్లు భక్తులను కొండ కింద నుండి కొండ పైకి చేరవేస్తాయి. స్వామి, అమ్మవార్లను వేడుకుంటే..దర్శించుకుంటే కోరిన కోర్కెలు తీరుతాయని..కష్టాల నుండి గట్టెక్కుతామని ప్రగాఢ విశ్వాసం. ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన ఈ ఆలయం..ఇపుడు అత్యంత ఆదాయం కలిగిన పుణ్య క్షేత్రంగా వినుతికెక్కింది. లెక్కించలేనంత బంగారం, వస్తువులు..బ్యాంకుల్లో మూలుగుతున్న కోట్లకొద్దీ కట్టలు..ఇసుక వేస్తే రాలనంత ఆభరణాలు, నాణేలు..ఇలా రోజూ సమర్పించు కోవడం అనాది నుంచి ఆనవాయితీగా వస్తోంది. భక్తులు ప్రేమతో..భక్తితో ఇచ్చే కానుకులే ఇవాళ కోట్లాది ప్రజల ఆకలిని తీరుస్తోంది. సుదూర ప్రాంతాల నుండి దర్శించుకునేందుకు వచ్చే యాత్రికులు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తిరుమల తిరుపతి దేవస్థానం సకల ఏర్పాట్లను చేస్తోంది. భక్తుల తాకిడిని తట్టుకోలేక స్లాట్స్‌ను ఏర్పాటు చేశారు.
నడక దారిన శ్రీవారి మెట్ల ద్వారా వచ్చే భక్తులకు ప్రత్యేకంగా దివ్య దర్శనం పేరుతో స్వామి, అమ్మ వార్లను దర్శించుకునే భాగ్యాన్ని కల్పించారు. 60 సంవత్సరాలు దాటిన సీనియర్ సిటిజన్స్‌కు స్పెషల్ దర్శనంతో పాటు దివ్యాంగులకు ప్రత్యేక సౌకర్యాన్ని కల్పించారు. తల్లులకు, ఏడాది లోపు చిన్నారులకు నేరుగా దర్శనం కల్పిస్తున్నారు. ఉండేందుకు గదులు, గెస్ట్ హౌస్‌లు..అన్నీ నిండి పోతే..సేఫ్ లాకర్స్ ఏర్పాటు చేశారు. కొండ పైన ఎక్కడికి వెళ్లినా ఒక్క పైసా ఖర్చు లేకుండా ఉచితంగా ధర్మ రథం బస్సులను నడుపుతున్నారు. ఎక్కడా అధిక ధరలకు భోజనాలు, టిఫిన్లు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టీటీడీ హెచ్చరికలు జారీ చేసింది. భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ప్రపంచ వ్యాప్తంగా తిరుమల, తిరుపతిని దర్శించుకునే భాగ్యాన్ని ఆన్ లైన్ ద్వారా నేరుగా బుక్ చేసుకునే సదుపాయన్ని కల్పించింది. దీంతో మధ్య దళారీలు, బ్రోకర్లు, మోసం చేసే వారి నుండి భక్తులను రక్షించింది. ఎలాంటి సిఫారసు లేఖలను అనుమతించడం లేదు. బ్రేక్ దర్శనం సమయంలోనే విఐపీలు, రాజకీయ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు, పేరొందిన వారికి మాత్రమే దర్శించుకునేందుకు పర్మిషన్ ఇస్తున్నారు.
టీటీడీ ఇఓగా బాధ్యతలు చేపట్టిన సీనియర్ ఐఏఎస్ అధికారి అనిల్ కుమార్ సింఘాల్ బాధ్యతలు స్వీకరించాక ..పూర్తి పారదర్శకతకు పెద్దపీట వేశారు. ఏ చిన్న పొరపాటు జరిగినా నేరుగా విజిలెన్స్ విభాగానికి ఫిర్యాదు చేసేలా చర్యలు తీసుకున్నారు. ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. తండోపతండాలుగా వచ్చే భక్తుల కోసం ఎక్కడికక్కడ భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. శ్రీనివాసం పేరుతో సముదాయాలను నిర్మించారు. అక్కడే అన్ని సౌకర్యాలు పొందేలా చూశారు. తలనీలాలు, దర్శన టోకెన్లతో పాటు ఉచితంగా ధర్మ రథం బస్సులు కొండ కింది నుండి అలిపిరికి అక్కడి నుండి శ్రీవారి మెట్ల వరకు తీసుకెళతారు. ఒక్క పైసా చెల్లించాల్సిన పనిలేదు. కింది నుండి పైకి వెళ్లేందుకు ఏపీ ఆర్టీసీ ఒక్కరికి 55 రూపాయల చొప్పున టికెట్ నిర్ణయించింది. 24 గంటల పాటు వందలాది బస్సులు, ఇతర ప్రైవేట్ వాహనాలు భక్తులను చేరవేస్తాయి. దేశం నలు మూలల నుండి ఈ పుణ్యక్షేత్రానికి రైలు , బస్సు, విమాన సర్వీసులు ఉండనే ఉన్నాయి.
కావాల్సిందల్లా సంకల్పం. ఆ శ్రీనివాసుడి పట్ల అచంచలమైన నమ్మకం కలిగి ఉండడమే. వెంకటేశా..శ్రీనివాసా..ఏడుకొండల వాడా..గోవిందా..గోవిందా అంటూ భక్తుల నినాదాలతో ఈ ప్రాంతం దద్దరిల్లిపోతుంది. లక్షలాది భక్తులు వచ్చినా ఎక్కడా కించిత్ ఇబ్బంది కలగకుండా టీటీడీ దర్శనం చేయిస్తోంది. ఆకలితో అలమటించాల్సిన పనిలేదు. హోటళ్ల కోసం వెతకాల్సిన పనిలేదు. అన్నీ ఉచితమే. పాలు, కాఫీ, టిఫిన్లు, భోజనం ప్రతిరోజు భక్తులకు కల్పిస్తోంది టిటిడి. రోజూ కోట్లాది రూపాయలు విరాళాల రూపేణా టీటీడీ నిత్యన్నదాన ట్రస్టుకు వస్తున్నాయి. వీటినన్నింటిని టీటీడీ ఆయా జాతీయ బ్యాంకుల్లో ఎఫ్‌డిలు చేస్తోంది. వీటి నుంచి వచ్చే వడ్డీ ద్వారా ఇంత మందికి అన్నదానం అందిస్తోంది. అత్యంత సంపన్నుడైన దేవుడిగా వినుతికెక్కిన శ్రీనివాసుడి దర్శనం కష్టం అనుకునేలా ఉండకూడదన్నదే తమ లక్ష్యమని అంటున్నారు ఇఓ సింఘాల్. ఉత్తరాది ప్రాంతానికి చెందిన ఈ ఐఏఎస్ అధికారి..నిజాయితీకి పెట్టింది పేరు. స్వామి వారి భక్తుడు.
భక్తుల అవస్థలను గమనించిన ఆ మహానుభావుడు దివంగత ముఖ్యమంత్రి శ్రీ నందమూరి తారకరామారావు. ఈ క్రెడిట్ అంతా ఆయనకే దక్కుతుంది. తెలుగు వారి ఆధ్యాత్మిక సంపద అయిన తిరుమల, తిరుపతిలో ఏ ఒక్కరు ఆకలితో ఉండడానికి వీలులేదన్నారు. అప్పటి ఈఓ కెఆర్‌కె ప్రసాద్ దీనికి ప్రణాళిక తయారు చేశారు. ఇంకేం ఈ మహోన్నత కార్యానికి బీజం పడింది. వీరిద్దరు ఇపుడు లేరు. వారి మదిలో మెదిలిన ఆలోచన ఇపుడు కోట్లాది కడుపులు మాడకుండా చేస్తోంది. మనుషులు భౌతికంగా లేక పోయినా ..వారి సదాశయం స్ఫూర్తి దాయకంగా నిలుస్తోంది. అదే నిత్య అన్నదానం మహా ప్రసాదమై భక్తులకు అండగా నిలుస్తోంది. 6 ఏప్రిల్ 1985లో ఉచితంగా భోజనాన్ని అప్పటి సీఎం ఎన్టీఆర్ ప్రారంభించారు. మొదట్లో 2 వేల మంది నుండి ప్రారంభమైన ఈ అద్భుత కార్యక్రమం ఇపుడు లక్షలాది భక్తులకు ఇబ్బంది లేకుండా చేస్తోంది.
వందలాది మంది స్వామి వారి భక్తులు స్వచ్ఛంధంగా సేవలు అందిస్తారు. నూతన టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ఎప్పడైనా ..ఎక్కడైనా నేరుగా వెళ్లవచ్చు. ఎవరి సిఫారసు అక్కర్లేదు. కడుపారా ..తృప్తిగా ..మీకు తోచినంతగా తినొచ్చు. చెట్ని, కూరగాయ, సాంబారు, రసం, మజ్జిగ వడ్డిస్తారు. తాగినంత నీళ్లు. ఇది స్వామి వారి కృపనే. ఇంటికి బంధువులు వస్తే ఇబ్బంది పడతాం. కాని ఆ పుణ్యక్షేత్రంలో ఎన్ని రోజులైనా వుండొచ్చు. అంతా ఉచితమే. నిత్య అన్నదానం కార్యక్రమం నిరాటంకంగా సాగాలంటే రోజుకు లక్షలాది రూపాయలు ఖర్చవుతాయి. భక్తులు ఇచ్చిన విరాళాలతో పాటు బియ్యం, దినుసులు, నూనె, ఇతర వాటిని టీటీడీ స్వీకరిస్తుంది. ఇందు కోసం ప్రత్యేకంగా శ్రీ వేంకటేశ్వర నిత్య అన్నదానం ట్రస్టును 1 ఏప్రిల్ 1994లో టీటీడీ ఏర్పాటు చేసింది. ట్రస్టుకు టీటీడీ ఛైర్మన్ పేరు మీద నడుస్తుంది. భక్తులు, దాతల నుండి విరాళాలు స్వీకరిస్తున్నారు. ఆదాయ పన్ను నుండి మినహాయింపు కూడా ఉంటుంది. అన్న ప్రసాదం కోసం విరాళాలు ఇచ్చే భక్తులు, దాతలకు టీటీడీ స్వామి, అమ్మవార్లను దర్శించుకునేందుకు టోకెన్లు అందజేస్తోంది.
ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10.30 గంటల వరకు భక్తులకు ప్రత్యేకంగా ఉప్మా, పొంగల్, చెట్నీతో పాటు ఉప్మాను వడ్డిస్తారు. భోజనం ఉదయం 10.30 గంటల నుండి సాయంత్రం 4 గంటల దాకా చక్కెర పొంగలి, కూర, చెట్నీ, అన్నం, సాంబారు, రసం, మజ్జిగ అందిస్తారు. తిరిగి 5 గంటల నుండి రాత్రి 10.30 గంటల దాకా భక్తుల ఆకలి తీరుస్తారు. అన్నదానాన్ని తిరుమల, తిరుపతి, తిరుచానూరు ప్రాంతాల్లో అందజేస్తారు. తిరుమల మాతృశ్రీ తరిగొండ వేంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్‌లో ప్రతి రోజు 55 వేల మంది భక్తులకు , శని, ఆదివారాల్లో 65 వేలకు పైగా భక్తులకు అన్నం వడ్డిస్తారు.వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ఒకటి, రెండు కంపార్ట్‌మెంట్స్‌లలో 40 వేల మంది రోజూ వారీ వేళల్లో..ఆదివారం 45 వేల మందికి పైగా భోజనం అందుతోంది. ఒకవేళ భక్తుల రద్దీ ఎక్కువగా వుంటే మరో 20 వేల మందికి అందుబాటులో అన్నం పెడతారు. పీఏసీ భవనంలో రోజూ 8 వేల మందికి..శని, ఆదివారాలలో మరో 10 వేల మందికి భోజనం వడ్డిస్తారు. ఫుడ్ కౌంటర్లను రాంభగీచ బస్టాండ్ ఆవరణలో, సెంట్రల్ రిసెప్షన్ ఆఫీసు వద్ద, పిలిగ్రిమ్ అమెనిటీస్ కాంప్లెక్స్, హెచ్‌విసి, ఏఎన్‌సీ వద్ద రోజుకు 8 వేల మంది, ఆరు వేల మంది, 10 వేల మందికి పైగా భక్తుల ఆకలిని తీర్చే పనిలో టీటీడీ నిమగ్నమైంది.
అంతేకాకుండా గాలిగోపురం భవనంలో ఆరు వేల మంది భక్తులకు, తిరుపతి శ్రీనివాసం కాంప్లెక్స్‌లో 5 వేలమందికి, ప్రభుత్వ, టీటీడీ ఆస్పత్రుల్లో రోజుకు 6 వేల మంది భక్తులకు, 2వ ఎన్‌సీ, 3వ ఎన్ సీ లో 2 వేల మంది భక్తులకు అన్నదానం జరుగుతోంది. తిరుచానూరు ఆలయంలో ఎస్‌వి అన్నప్రసాదం లో రోజుకు 5 వేల మందికి పైగా భక్తుల ఆకలి తీరుతోంది. ఈ భవనాల సముదాయాలలో రోజుకు సరాసరి లక్షా 60 వేల నుంచి 2 లక్షల 10 వేల మందికి పైగా వివిధ ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు అన్నం అందుతోంది. రోజుకు భక్తులు, చిన్నారులు , వృద్దులు ఇబ్బంది పడకుండా 10 వేల లీటర్ల పాలు సరఫరా చేస్తున్నారు. విక్యూసీ ఒకటి, రెండు భక్తుల కంపార్ట్‌మెంట్లలో , దివ్య దర్శనం కాంప్లెక్స్, సర్వదర్శనం కాంప్లెక్స్, ప్రత్యేక దర్శనం కాంప్లెక్స్, కళ్యాణ కట్ట కాంప్లెక్స్ , తిరుమలలో భక్తులకు అందజేస్తోంది టీటీడి. విక్యూసీ ఒకటి, రెండు కంపార్ట్‌మెంట్లలో వేచి వుండే భక్తుల కోసం ప్రతి మూడు గంటలకు ఒకసారి సాంబారు, అన్నం పెడతారు. ప్రతి ఏడాది నూతన సంవత్సరం రోజు, వైకుంఠ ఏకాదశి, రథసప్తమి, శ్రీ స్వామి వారి గరుడ సేవ రోజు లక్షలాది మంది భక్తులు ఎక్కువ సంఖ్యలో తిరుమల, తిరుపతిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
12 టన్నుల బియ్యం తిరుమలలో, 2 టన్నుల బియ్యం తిరుపతిలో వంటకు వాడుతున్నారు. 7.5 టన్నుల కూరగాయలు ఉపయోగిస్తున్నారు. ఇవన్నీ భక్తులు ఇచ్చిన విరాళాల ద్వారానే ఖర్చు చేస్తోంది టీటీడి. బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమల, తిరుపతితో పాటు తిరుచానూరు, అప్పలాయకుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయం, శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయం, తిరుపతిలోని గోవిందరాజ స్వామి గుడి, శ్రీ కోదండరామ స్వామి ఆలయం, శ్రీ కపిలేశ్వర ఆలయంతో పాటు ఒంటిమిట్టలోని శ్రీ కోదండ రామ స్వామి ఆలయంలో అన్నదానం చేస్తారు. భక్తుల కోరిక మేరకు ఒక రోజు భక్తులకు అన్నదానం పెట్టేందుకు అనుమతి ఇస్తోంది టీటీడీ. ఇందు కోసం భక్తులు సూచించిన రోజు కావాలంటే 26 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. దాతల పేర్లు టీటీడీ ప్రకటిస్తుంది. ఒక రోజు ఖర్చును మరో రకంగా ఉపయోగించుకునేలా చేసింది.
బ్రేక్ ఫాస్ట్ కోసం 6 లక్షలు, మధ్యాహ్నం భోజనం కోసం 10 లక్షలు, రాత్రి భోజనం కోసం మరో 10 లక్షలు కడితే చాలు . వారి పేరు మీద ఆ రోజు అన్నదానం చేస్తారు. కోట్ల రూపాయలు అన్నదానం కోసం సమకూరుతున్నాయి. కోట్లాది భక్తుల కళ్లల్లో ఆనందం వెళ్లి విరుస్తోంది. ఇదంతా ఆ శ్రీనివాసుడి మహిమ. మానవత్వం కలిగిన వారు ఎవరైనా తాము సంపాదించిన దాంట్లో కొంతలో కొంతైనా ఆ దేవదేవుడికి..కలియుగ వేంకటేశ్వరుడికి విరాళాల రూపేణా సమర్పించుకుంటే..భక్తుల ఆకలి తీరుతుంది. ఈ భూమి మీద వెలసిన ఆ శ్రీనివాసుడి కృపకు పాత్రులు కావాలంటే కాసింత సాయపడితే పేరుతో పాటు తృప్తి మిగులుతుంది. అందుకే అన్నదాతా సుఖీభవ...ఈ మహోన్నత కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఎన్టీఆర్, ప్రసాద్‌లకు మనమంతా రుణపడి వుండాలి. శ్రీనివాసా..గోవిందా..గోవిందా..!
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి