వెల్లి విరిసిన చైత‌న్యం..అన్న‌దాత‌ల ఆగ్ర‌హం - దేశం చూపు నిజామాబాద్ వైపు

ఎన్నిక‌ల వేళ దేశ‌మంతా తెలంగాణ‌లోని నిజామాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం వైపు చూస్తోంది. ఎన్న‌డూ లేనంత‌గా ఈ ప్రాంతం ఇపుడు దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. దీని ప్ర‌త్యేక‌త ఏమిటంటే ఇక్క‌డ ఏకంగా 200 మంది రైతులు ఎంపీ ఎన్నిక‌ల్లో బ‌రిలో దిగారు. తాము పండించిన పంట‌కు మ‌ద్ధ‌తు ధ‌ర ల‌భించ‌డం లేదని, ఆరుగాలం పండించే త‌మ‌ను తెలంగాణ ప్ర‌భుత్వం ప‌ట్టించు కోవ‌డం లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ జిల్లాలో ఎక్కువ శాతం ప‌సుపు, చెరుకు పంట పండిస్తారు. ఎన్నిసార్లు మొత్తుకున్నా..విన్న‌వించుకున్నా ఉన్న‌తాధికారులు కానీ..పాల‌కులు కానీ త‌మ గోడు విన్న పాపాన పోలేదంటున్నారు బాధితులు. త‌మ స‌మ‌స్యను దేశ వ్యాప్తంగా తెలియ చేయాల‌నే ఉద్ధేశంతోనే తాము ఎన్నిక‌ల‌ను ఆయుధంగా మ‌ల్చుకున్నామ‌ని వారంటున్నారు. ఇక్క‌డ సిట్టింగ్ ఎంపీ క‌ల్వ‌కుంట్ల క‌విత ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. రైతుల స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి తన వంతు కృషి చేశాన‌ని ఆమె అంటున్నారు.

కానీ అన్న‌దాత‌లు మాత్రం ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. మాట‌లు త‌ప్ప ఆచ‌ర‌ణ‌లో త‌మ గురించి ఆలోచించిన దాఖ‌లాలు లేవ‌న్నారు. ఎన్నిక‌ల సంఘం ప్ర‌త్యేకంగా బ్యాలెట్ బాక్సులు ఏర్పాటు చేస్తోంది. ఈవిఎంలను వాడ‌డం లేదు. రైతులంతా నిజామాబాద్ జిల్లా క‌లెక్ట‌ర్ ఆఫీసు కార్యాల‌యాన్ని ముట్ట‌డించేందుకు ప్ర‌య‌త్నం చేశారు. భారీ ఎత్తున పోలీసుల‌ను మోహ‌రించారు. తాము ఆందోళ‌న‌కారులం కామ‌ని ..అన్నం పెట్టే అన్న‌దాత‌ల‌మ‌ని త‌మ‌పై దాడుల‌కు పాల్ప‌డ‌డం ఎంత‌వ‌ర‌కు స‌బ‌బు అని నిల‌దీశారు. రాబోయే లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో త‌మ ప‌వ‌ర్ ఏమిటో చూపిస్తామంటున్నారు. రైతులంతా టెంట్ వేసుకున్నారు. త‌మను గుర్తించాల‌ని..త‌మ‌కు ఓటు వేయాల‌ని..త‌మ స‌త్తా ఏమిటో రాష్ట్రానికి, కేంద్రానికి తెలియ చేయాల‌ని క్యాంపెయిన్ చేస్తున్నారు. గ‌త రెండు నెల‌లుగా జిల్లాలో జాతీయ ప‌సుపు బోర్డు మంజూరు చేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు. క‌నీస మ‌ద్ధ‌తు ధ‌ర క‌ల్పించాల‌ని, ప‌సుపు, కందుల పంట‌ల‌ను కాపాడాల‌ని కోరుతున్నారు. మ‌ద్ధతు ధ‌ర క‌ల్పిస్తాన‌ని, రైతుల‌ను ఆదుకుంటాన‌ని, ప‌సుపు బోర్డు సాధించి తీరుతాన‌ని 2014లో జ‌రిగిన లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో సిట్టింగ్ ఎంపీ కవిత హామీ ఇచ్చారు.

ఎలాంటి ప్ర‌గ‌తి క‌నిపించ‌క పోవ‌డంతో ప్ర‌త్య‌క్షంగా రైతులు ఆందోళ‌న బాట ప‌ట్టారు. దీనికి సంబంధించిన బిల్లు 2017లో పార్ల‌మెంట్ లో ప్ర‌వేశ పెట్టారు. బోర్డు ఏర్పాటైతే చైర్ ప‌ర్స‌న్, ఎంపీలు, ప్ర‌భుత్వ ప్ర‌తినిధులతో పాటు మంత్రులు , ప‌సుపు రైతులు, ఎగుమ‌తి దారులు, సైంటిస్టులు ఇందులో స‌భ్యులుగా ఉంటారు. బిల్లు పాసైనా బోర్డు మాత్రం ఏర్పాటు కాలేదు. దీంతో గ‌త్యంత‌రం లేని ప‌రిస్థితుల్లో రైతులంతా క‌లిసి ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. మ‌మ్మ‌ల్ని అడుగ‌డుగునా అడ్డుకుంటున్నారు. మాపై కేసులు బ‌నాయిస్తున్నారు. త‌మ న్యాయ‌ప‌ర‌మైన డిమాండ్ల గురించి మాట్లాడ‌కుండా చేస్తున్నారు. దీంతో మా గోడును వినాల్సిన ప్ర‌భుత్వం మా వైపు ఉండ‌డం లేద‌న్న వాస్త‌వం అర్థ‌మైంది. బ్యాలెట్ ద్వారా అయితే మా వాయిస్ వినిపించ‌వ‌చ్చ‌ని అనుకున్నాం. అందుకే నామినేష‌న్ల‌ను వేశామంటున్నారు రైతులు. ఇది కూడా త‌మ నిర‌స‌న‌గా భావించాల్సి ఉంటుంద‌ని అంటున్నారు రైతుల‌ను స‌మీక‌రించి పోటీ చేసేలా చేస్తున్న రైతు అన్వేష్ రెడ్డి. అన్న‌దాత‌ల‌కు అండ‌గా వుంటూ..వారిని చైత‌న్య‌వంతం చేస్తున్నారు ఆయ‌న‌. 1000 మంది రైతుల‌తో నామినేష‌న్లు వేయించాల‌ని అనుకున్నాం. కానీ ఎన్నిక‌ల సంఘం ఒప్పుకోలేదు.

బోధ‌న్, బాల్కొండ‌, నిజామాబాద్ రూర‌ల్, నిజామాబాద్ అర్బ‌న్, కోరుట్ల‌, ఆర్మూర్, జ‌గిత్యాల నియోజ‌క‌వ‌ర్గాల నుండి రైతులు ఇక్క‌డ నామినేష‌న్లు దాఖ‌లు చేశారు. నామినేష‌న్లు వేసేకంటే ముందు నిజామాబాద్ నుండి హైద‌రాబాద్ వ‌ర‌కు ర్యాలీ నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు. అయితే పోలీసులు అందుకు ప‌ర్మిష‌న్ ఇవ్వ‌లేదు. 144వ సెక్ష‌న్ విధించారు. వీరి వెనుక ప్ర‌తిప‌క్షాల పాత్ర ఉంద‌ని క‌విత ఆరోప‌ణ‌లు చేశారు. దీనిని రైతులు ఖండించారు. త‌మ వెనుక ఏ పార్టీ లేద‌ని..తాము స్వంతంగా తీసుకున్న నిర్ణ‌య‌మ‌ని స్ప‌ష్టం చేశారు. గ్రామాల్లో చ‌ర్చించాం. మ‌న స‌మ‌స్య ప‌రిష్కారం కావాలంటే పోటీ చేయ‌డం ఒక్క‌టే మార్గ‌మ‌మ‌ని నిర్ణ‌యానికి వ‌చ్చామ‌న్నారు అన్వేష్. నిజామాబాద్ జిల్లాలో ప‌సుపు ఎక్కువ‌గా పండిస్తారు. ఎక‌నామిక్ అండ్ స్టాటిస్టిక్స్ రిపోర్ట్ 2012 ప్ర‌కారం 13 ల‌క్ష‌ల 5 వేల 668 హెక్టార్ల‌లో సాగు చేస్తున్నారు. క‌రీంన‌గ‌ర్, రంగారెడ్డి, ఆదిలాబాద్, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్, న‌ల్ల‌గొండ జిల్లాల కంటే అత్య‌ధికంగా ఈ పంట‌ను ఇక్క‌డ పండిస్తున్నారు. ఎక‌రా ప‌సుపు సాగుకు రైతులు ల‌క్షా 30 వేల నుండి ల‌క్షా 50 వేల రూపాయ‌లు ఖ‌ర్చు చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా నుండి ఇత‌ర దేశాల‌కు ప‌సుపు ఎగుమ‌తి అవుతోంది.

2016 -2017లో పాకిస్తాన్, బంగ్లాదేశ్‌, శ్రీ‌లంక , త‌దిత‌ర దేశాల‌కు ఎగుమ‌తి చేశారు. ఈ ఏడాది 3 ల‌క్ష‌ల 5 వేల 97 ట‌న్నుల ప‌సుపు పండించారు. క్వింటాలు ప‌సుపున‌కు 7 వేల రూపాయ‌లు ఖ‌ర్చ‌వుతే ప్ర‌భుత్వం మాత్రం 4 వేల 500 రూపాయ‌లు మాత్ర‌మే ఇస్తుందని ఇట్లాగ‌యితే ఎట్ల బ‌త‌కాల‌ని నాలుగు ఎక‌రాల లంబాడా రైతు శివ‌రాజ్ వాపోయారు. కొన్ని త‌రాలుగా మేం ప‌సుపును పండిస్తూ వ‌స్తున్నాం. ఇదే మా జీవ‌నాధారం. క‌నీస మ‌ద్ధ‌తు ధ‌ర క‌ల్పించ‌క‌పోతే ప్ర‌భుత్వం ఉండీ ఏం లాభ‌మంటున్నారు. మార్కెట్ యార్డుల‌ను అనుసంధానం చేస్తూ ఈ నామ్ ఏర్పాటు చేశారు. ఇవి కూడా ఫెయిల్ అయ్యాయి. యార్డుల‌లో మ‌ధ్య ద‌ళారీల వ్య‌వ‌స్థ వ‌ల్ల రైతుల‌కు తీర‌ని న‌ష్టం వాటిల్లుతోంది. పంట చేతికొచ్చే స‌మ‌యంలో 60 మంది లేబ‌ర్స్ అవ‌స‌ర‌మ‌వుతారు. వీరికి కూలీ డ‌బ్బులు చెల్లించాలంటే ప్రాణం పోయినంత ప‌న‌వుతోంది. ఒక్కోసారి మేం ఎందుకు ఇట్లా ఉన్నామో తెలియ‌డం లేదంటున్నారు బాధితులు.

గ‌తంలో తమ భూములు త‌మ‌కు ఇప్పంచాల‌ని కోరుతూ పాల‌మూరు జిల్లాలోని పోలేప‌ల్లి రైతులు ఎంపీ ఎన్నిక‌ల్లో పోటీ చేశారు. దేశ‌పు దృష్టిని ఆక‌ర్షించారు. కానీ నిజామాబాద్ ప‌సుపు రైతులు మాత్రం చ‌రిత్ర‌ను తిర‌గ రాశారు. 200 మందికి పైగా పోటీలో నిలిచి మ‌రో రికార్డు న‌మోదు చేశారు. బంగారు తెలంగాణ కంటే త‌మ‌ను ప‌ట్టించుకుంటే చాల‌ని రైతులు కోరుతున్నారు. వారు అడిగిన దాంట్లో న్యాయం ఉంది క‌దూ. దేశంలోని మేధావులు, ప్ర‌జాస్వామిక వాదులు, రైతు సంఘాల నేత‌లు రైతులకు మ‌ద్ధ‌తు తెలుపుతున్నారు. రాబోయే ఎన్నిక‌ల్లో ఏం జ‌రుగుతుంద‌నేది వేచి చూడాల్సిందే.

కామెంట్‌లు