సై..సైరా ..సురేందర్ రెడ్డి..!
సినిమా అన్నది పేషన్. అదో మాయా ప్రపంచం. కలల బేహారుల ఖార్ఖానా. వేలాది మంది దీనిపైనే ఆధార పడ్డారు. జూదం కంటే ప్రమాదకరమైన రంగం ఇది. అయినా లెక్కలేనంత మంది దీని చుట్టూ తిరుగుతుంటారు. కూటికి లేక పోయినా..నడిచేందుకు శక్తి లేక పోయినా సరే ఈ రంగమంటే అమితమైన ఆసక్తి. లెక్కలేనంత టాలెంట్ ఉన్నా ..గుర్తింపునకు నోచుకోక పోయినా ..ఏదో ఒకరోజు అవకాశం తలుపు తడుతుందని..అదృష్టం వరిస్తుందని ఈ చట్రంలోనే తిరుగతూ వున్న వాళ్లు ఎందరో. ఒక్కసారి దీనిని ప్రేమిస్తే చాలు ..బతుకంతా దీనితోనే. చావు పలకరించే దాకా ఇందులోనే. ఒక్కరోజులో రాజు కావాలని అనుకున్న వాళ్లకు ఇది అద్భుతమైన దారి చూపిస్తుంది. సినిమా అంటేనే 24 ఫ్రేమ్స్. కలలు పండాల..ఊహలకు ప్రాణం పోయాలి. నటీ నటులు ..టెక్నీషియన్స్..లొకేషన్స్..డిస్ట్రిబ్యూటర్స్..పబ్లిసిటీ..ఆడియో లాంఛింగ్..మూవీ రిలీజ్ దాకా..వందలాది మంది ఇందులో లీనమవుతారు. తమను తాము ఆవిష్కరించుకునేందుకు పడరాని పాట్లు పడతారు.
ఒకప్పుడు నిర్మాతలకు ఓ వాల్యూ ..ఐడెంటిటి వుండేది. ఇపుడంతా హీరో ఓరియంటెడ్ మూవీస్ అయిపోయాయి. వాళ్లదే రాజ్యం. వాళ్లతోనే వ్యాపారం. సినిమా సక్సెస్ టాక్ తెచ్చుకుంటే డైరెక్టర్, హీరో, హీరోయిన్లు కనిపిస్తారు. లేదంటే నిర్మాతతో కొద్ది సేపు మాట్లాడించి మూసేస్తారు. ఇదే ఇపుడు నడుస్తున్న ట్రెండ్. హెవీ కాంపిటిషన్ పెరిగింది ఈ రంగంలో. తెలుగు సినిమా రేంజ్ హాలీవుడ్ స్థాయికి చేరుకుంది. ఒకప్పుడు 356 రోజులు ఆడించేందుకు నానా తిప్పలు పడేవారు. ఇపుడు అలా కాదు..జస్ట్ సినిమా వారం రోజుల్లోనే తెలిసి పోతుంది. దాని స్టామినా ఏమిటో..ఆడుతుందా లేదా అన్నది. ఆంధ్రా డామినేషన్ ఎక్కువగా ఉన్న ఈ రంగంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన వాళ్లు తమదైన మార్క్‌తో రాణిస్తున్నారు. వారిలో దమ్మున్నోడు మన సురేందర్ రెడ్డి. ఎంతైనా పుట్టుకతో వచ్చిన ధైర్యం..సినిమాలో కూడా అదే ప్రజెంటేషన్. ఎక్కడా రాజీ పడకుండా రిచ్ గా వుండేలా తీసేలా పేరు తెచ్చుకున్నాడు. తక్కువ కాలంలోనే సక్సెస్ ఫుల్ డైరెక్టర్ల జాబితాలోకి చేరి పోయాడు.
కళ్యాణ్ రామ్ తో అతనొక్కడే సినిమా తీశాడు. దీనితోనే తెరంగ్రేటం చేశాడు. అది కూడా మంచి టాక్ తెచ్చుకుంది. 7 డిసెంబర్ 1975లో కరీంనగర్ జిల్లా మాచినపల్లి గ్రామంలో జన్మించాడు. పూర్తి పేరు పత్తి సురేందర్ రెడ్డి. డైనమిజం..హీరోయిజం..మాస్ ..ఓరియంటెడ్ కు ప్రయారిటీ వుండేలా సినిమాలు తీయడంలో రెడ్డి దిట్ట. వయస్సు రీత్యా 43 ఏళ్లయినా ఎక్కడా కూడా రాజీ పడని మనస్తత్వం ఈ డైరెక్టర్‌ది. కథ ఓకే అయితే వెంటనే రంగంలోకి దిగడం, లో ప్రొఫైల్ మెయింటెనెన్స్ చేయడం ఆయనకు అలవాటు. చదువు మీద ఇంట్రస్ట్ లేక పోవడం..సినిమా రంగంపై ఆసక్తి ఉండడంతో ఇక్కడే సెటిల్ అయి పోయాడు. మణిరత్నం ఘర్షణ, రాం గోపాల్ వర్మ శివ సినిమాలకు సురేందర్ రెడ్డి మీద ప్రభావం చూపించాయి. దీనిని క్రియేట్ చేయాలంటే..డైరెక్టర్ కావాల్సిందే. సో..తాను డైరెక్టర్ అయితే ఏదైనా చేయొచ్చు..కలలకు రెక్కలు తొడిగి రివ్వుమని ఎగిరేలా తీయొచ్చని డిసైడ్ అయ్యాడు. ఆ పట్టుదలే అతడిలో మరింత కసిని పెంచింది. దమ్మున్న డైరెక్టర్‌గా మలిచింది.
ఊరు నుంచి హైదరాబాద్ వచ్చిన తనకు ఈ సినిమా రంగం కొత్తగా అనిపించింది. ఛాన్స్ అంత సులువు కాదని తెలిసి పోయింది. బాగా ఉన్న కుటుంబం కావడంతో రెడ్డికి ఖర్చులకు డబ్బులు వుండేవి. స్వంత బావ అపార్ట్‌మెంట్‌లో ఉండడం..అవకాశాల కోసం ప్రయత్నం చేయడం దినచర్యగా పెట్టుకున్నాడు. ఒకరిని అడగడం అంటే సురేందర్ రెడ్డికి ష్టం ఉండేది కాదు..ఏదైనా స్వంతంగా సంపాదించుకుని తినాలన్న కోరిక అతడిని ఈ రంగం వైపు మళ్లేలా చేసింది. ఎన్ని ఇబ్బందులు పడ్డా చివరకు డైరెక్టర్‌గా తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. కళ్యాణ్ రామ్‌కు మంచి సక్సెస్ ఇచ్చాడు. ఇందులో సింధు తులానీ హీరోయిన్. మణిశర్మ సంగీతం అందించారు. బాక్సాఫిస్ వద్ద కాసులు వచ్చేలా చేసింది ఈ మూవీ. 2006లో జూనియర్ ఎన్టీఆర్, సమీరా రెడ్డితో కలిసి అశోక్ మూవీ తీశాడు. దీనికి కూడా మణి శర్మే మ్యూజిక్ ఇచ్చాడు. 2007లో మహేష్ బాబు, అమృతారావుతో కలిసి అతిథి సినిమా తీశాడు. రెండేళ్ల గ్యాప్ తర్వాత రైజింగ్ స్టార్ రవితేజ, ఇలియానాతో కిక్ మూవీ రూపొందించాడు. భారీ వసూళ్లను రాబట్టింది. హిట్ టాక్ తెచ్చుకుంది.
రెడ్డికి ఇక ఎదురే లేకుండా పోయింది. దీనికి తమన్ సంగీతం అందించారు. 2011లో జూనియర్ ఎన్టీఆర్, తమన్నాతో ఊసరవెల్లి సినిమా తీశాడు. దీనికి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇచ్చాడు. 2014లో మూడేళ్ల గ్యాప్ తర్వాత అల్లు అర్జున్, శృతి హాసన్‌తో తీసిన రేసుగుర్రం బాక్సాఫిస్ వద్ద వసూళ్లు రాబట్టింది. భారీ సక్సెస్ సాధించింది. 2015లో రవితేజ, రకుల్ ప్రీతి సింగ్ తో కిక్ -2 తీశాడు. అనుకున్నంత ఆడలేదు. 2016లో రాం చరణ్ తేజ, రకుల్‌తో కలిసి ధృవ తీశాడు. యావరేజ్‌గా నడిచింది. ఊహించని రీతిలో చిరంజీవితో సినిమా తీసే అరుదైన ఛాన్స్ కొట్టేశాడు సురేందర్ రెడ్డి. అదే సై..సైరా నరసింహా రెడ్డి సినిమా. ఇందులో ప్రధాన పాత్రల్లో చిరంజీవి, అమితాబ్ బచ్చన్, నయన తార నటిస్తుండగా ఎం.ఎం. కీరవాణి సంగీతం ఇస్తున్నారు.
2005 నుండి నేటి దాకా కొన్ని సినిమాలు తీసినా టాప్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు. అందరి అంచనాలు తలకిందులు చేస్తూ భారీ అంచనాల మధ్య సైరా రాబోతున్నది. ఇందు కోసం అహోరాత్రులు కష్ట పడుతున్నాడు సురేందర్ రెడ్డి. నరసింహా రెడ్డిలోని పౌరుషత్వం..తెగింపు..ధైర్యం..జీవితాన్ని తెరకెక్కిస్తున్న ఈ డైనమిక్ డైరెక్టర్ రేపటి విజయం కోసం వేచి చూస్తున్నాడు. అతడి ఆశయం ఫలించాలని ఆశిద్దాం. ఎంతైనా దమ్మున్న డైరెక్టర్‌కు కలక్షన్లు రాబట్టడం ఓ లెక్కా. జస్ట్..వెయిట్ చేయడమే..చిరంజీవి అభిమానులు ఒక్కరోజు సినిమా చూస్తే చాలు..ఖర్చు పెట్టిన డబ్బులు రాకుండా పోతాయా..కదూ..!
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి