పాలమూరు పోరగాడు..పల్లెపాటల్లో మొనగాడు - జంగిరెడ్డి గానం జానపదమే ప్రాణం..!
పొలమారిన పాలమూరు జిల్లా తరాలు మారిన బతుకు సిత్రం మారలె. కానీ ఈ ప్రాంతం పోరాటాలకు పెట్టింది పేరు. చైతన్యానికి ..కాలే కడుపులకు పట్టెడన్నం పెట్టే ధీరోదాత్తులను కన్నది ఈ నేల. ఎందరో మహానుభావులు ..మరికొందరు ఈ భూమి మీద లేకుండా పోయారు. కవులు, కళాకారులు, గాయనీ గాయకులు, రచయితలు, మేధావులు..జర్నలిస్టులు, అధ్యాపకులు, ఆర్టిస్టులు, నాటక ప్రయోక్తలు, గ్రాఫిక్ డిజైనర్లు.సాధువులు, యోగులు, ఆధ్యాత్మిక వేత్తలను ఈ ప్రాంతం నుండి వచ్చారు. తమ ప్రతిభకు పదును పెడుతూ..సృజనాత్మకతకు ప్రాణం పోస్తూ ..తమ పుట్టిన ఈ గడ్డకు ఎనలేని పేరు తీసుకు వస్తున్నారు. పల్లె పాటలకు పెట్టింది పేరు ఈ నేల. ఈ జాగలో దమ్ముందు..ధైర్యం ఉంది..అంతకంటే ఎనలేని ఆర్ద్రత ఉన్నది. మట్టి పొరల్లో ఇంకి పోయిన దుఖఃం గడ్డ కట్టుకు పోయి ఉన్నది. సంచార జీవులు..పకీర్లు..పీర్ల పండుగలో అలయి బలయిలు ..మైసమ్మలు..ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి పల్లె జానపదుల్లో లీనమై పోయింది. కళలకు ..పాటలకు ..జనపదాలకు..పెట్టింది పేరు పాలమూరు. ఎందరో కళాకారులు తమ ఆట పాటలతో ఆకట్టుకుంటున్నారు. తమదైన శైలితో జనాన్ని చైతన్యవంతం చేయడంలో నిమగ్నమయ్యారు.
1997లో ఓ పోరడు నా వద్దకు వచ్చాడు..అన్నా దండమే..నేను పాడుతానన్నాడు..ఆశ్చర్య పోయా..అచ్చం మా నాయినమ్మ మాట్లాడినట్టు..మర్మం ..మోసం ఎరుగని ..లౌక్యం తెలియని పల్లెవాసుల మంచితనం ఆ గొంతులో కనిపించింది. అతడే పాలమూరు జానపదానికి చిరునామాగా మారి పోయిన..పేరొందిన గాయకుడిగా చెలామణి అవుతున్న జంగిరెడ్డి. ఎక్కడ మహదేవుని పేట..ఎక్కడ రాజధాని..ఇరు రాష్ట్రాలతో పాటు పలు దేశాల్లో పర్యటించాడు. ప్రదర్శనలు ఇచ్చాడు. పల్లె పాటల్లో ఉన్న పవర్‌ను జనానికి రుచి చూపించాడు ఈ గాయకుడు. 5 జూన్ 1974లో బిజినేపల్లి మండల పరిధిలోని మహదేవునిపేటలో జన్మించాడు. తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నాడు. నాటకాలు చూడడం, గాయకుల గాత్రాలను గమనించడం ..పాటల్లోకి చేరి పోయిన జీరను తన గొంతులోకి చేర్చుకుని జానపద గాయకుడిగా అంచెలంచెలుగా ఎదిగాడు. డిసిఏ, డిఇసీఇ చదివిన జంగిరెడ్డి..చిన్నతనం నుంచే కష్టాలతో సహవాసం చేశాడు. చదువులో రాణించినా..పల్లెతనపు ఛాయలు పోలేదు. అందుకే జనం కోసం పాటలు కట్టాడు. సాయంత్రం నుండి అర్ధరాత్రి దాకా తన గానంతో వందలాదిగా ప్రదర్శనలు ఇస్తూ వచ్చాడు. ఒకటా రెండా ఏకంగా వేలాదిగా ఆయన ఖాతాలోకి చేరి పోయాయి.
పాలమూరు జిల్లాలో గాయనీ గాయకులను, రచయితలను వెలుగులోకి తీసుకు వచ్చింది మాత్రం కమల్ ఆడియో. ఎక్కడ టాలెంట్ వుంటే అక్కడికి వెళ్లడం వారికి శిక్షణ ఇవ్వడం..ప్రతిభకు పదును పెట్టడం..జీవనోపాధి కల్పించడం కమల్ చేస్తూ వస్తున్నారు. ప్రజలను 20 ఏళ్లకు పైగా చైతన్యవంతం చేయడంలో కీలక భూమిక పోషించాడు. ప్రజల గీతాలే కాకుండా ..సినిమా పాటలతో పాటు పేరొందిన ఆలయాలు, దేవుళ్లపై పాటలు పాడాడు. మన్యంకొండ, కురుమూర్తి స్వామి పాటలు జంగిరెడ్డిని రాష్ట్ర స్థాయిలో విస్మరించలేని గాయకుడిగా నిలబెట్టాయి. తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకున్నాడు. ప్రజలతో కలిసి నడిచాడు జంగిరెడ్డి. జానపద కళా స్రవంతిని స్థాపించాడు. జంగిరెడ్డికి స్వంతంగా ఓ టీం వుంది. ఆయనతో పాటు టీం సభ్యులను తీసకు వెళతారు. పాటలతో కూడిన ఆల్బంలను, సీడీలను విడుదల చేశారు. జానపద లహరి, నిజాంపోరి, బంజారా, మామరా చోరి, కొండ మల్లెలు, జానపద కోయిల, జానపద కోలాటం, కొంటె కోలాటం, శ్రీశైల మల్లన్న, శ్రీశైల మల్లన్న వారాలు, జానపదం ఝల్లుమంది, జై శభరీష్వర, పాడుదామా స్వేచ్ఛ గీతం, వివేక వాణి, జానపద భజనలు, శ్రీ కురుమయ్య భక్తి గీతాలు, మన్నెంకొండల్లో వెంకన్న, సింగోటం నరసింహస్వామి జానపద భక్తి గీతాలు, మహంకాళి జాతర , ఆంజనేయ స్వామి భక్తి గీతాలు, అయ్య దర్శనం, అందరివాడు అయ్యప్ప, అఖిల లోక నాయక అయ్యప్ప, జై మణికంఠ, శరణంతో పాటు తెలంగాణ గీతాలను రిలీజ్ చేశాడు జంగిరెడ్డి. సారాకు వ్యతిరేకంగా పాటలు కట్టి చైతన్యవంతం చేశాడు.
హెచ్ ఐవి, ఎయిడ్స్, టీబీ, లెప్రసీ పై అవగాహన కల్పించాడు. అక్షరాస్యత, ఆరోగ్యం, పరిశుభ్రత, స్వయం సహాయక సంఘాలు, అంటరానితనం, మహిళా సాధికారత, బ్రూణ హత్యలు, పర్యావరణం , కాలుష్యం, ఫ్యామిలీ ప్లానింగ్, జనాభా కంట్రోల్, బాల కార్మిక నిర్మూలన, క్లీన్ అండ్ గ్రీన్, వాటర్ షెడ్ ప్రోగ్రామ్స్, స్వచ్ఛ తెలంగాణ, తెలంగాణకు హరిత హారం, అవినీతిని అంతం చేద్దాం, ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకుందామంటూ జంగిరెడ్డి ఊరూరా తిరుగుతూ ప్రదర్శనలు ఇస్తూ..అవగాహన కల్పించారు. 1990లో పాలమూరు జిల్లాలో డిపిఆర్ ఓ ద్వారా కళాజాత చేపట్టారు. బుర్రకథల ద్వారా జనాన్ని జాగృతం చేశాడు. 1991లో కళాజాత ద్వారా మహిళా సంఘాలను బలోపేతం చేశాడు. 1992లో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని గద్వాలలో ప్రదర్శించిన కోయ నృత్యానికి అప్పటి సీఎం కోట్ల విజయ భాస్కర్ రెడ్డి జంగిరెడ్డిని అభినందించి..సత్కరించారు. 1993లో గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యంతో పాటు మ్యూజిక్ డైరెక్టర్ జేవి రాఘవులు న్యాయ నిర్ణేతలుగా జరిగిన మ్యూజిక్ కాంపిటిషన్‌లో జంగిరెడ్డి అద్భుత ప్రదర్శనతో మొదటి స్థానంలో నిలిచారు. ఈ ఉద్దండులతో సత్కారం పొందారు. 1995లో డిపిఆర్ ఓ ద్వారా కళాజాత ప్రదర్శనతో పల్లె సద్దులు పేరుతో ప్రదర్శన ఇచ్చారు.
1998లో స్వంతంగా కళాకారుల కోసం జానపద కళా స్రవంతి అనే పేరుతో కళా సంస్థను రిజిష్టర్ చేయించారు. 1998లో జానపద నాటక రిపర్టీ పేరుతో జరిగిన శిక్షణ లో పాల్గొన్నాడు. జాతీయ స్థాయిలో పేరొందిన కళాకారులతో పాటు జంగిరెడ్డి ప్రదర్శన ఇచ్చారు. మట్టిబండి, దొంగ సత్తయ్య మంచి పేరు తీసుకు వచ్చాయి. 2002లో ఏపీవెల్ ప్రాజెక్టుతో పాటు డిసిఐసీ ప్రాజెక్టులకు సంబంధించి కల్చరల్ రిసోర్స్ పర్సన్‌గా శిక్షణ ఇచ్చారు. 2007లో కడపలో జరిగిన సాంస్కృతోత్సవాలులో పాల్గొన్నారు. 2008లో స్తంభాద్రి ఉత్సవాల్లో ప్రదర్శనలు ఇచ్చారు. ఏపీ ప్రభుత్వం 2010లో కడపలో నిర్వహించిన శ్రీకృష్ణ దేవరాయ పట్టాభిషేక పంచ శతాబ్ధి మహోత్సవాలులో పాల్గొన్నారు. 2011లో మహబూబ్‌నగర్‌లో జరిగిన జాతీయ సమైక్యతా సదస్సులో దుమ్ము రేపాడు. గుజరాత్‌లోని వడోదరలో జరిగిన కార్యక్రమంలో ప్రదర్శన ఇచ్చాడు. అదే ఏడాది తెలుగు సంఘం ఆధ్వర్యంలో మారిషష్ లో జరిగిన ప్రపంచ తెలుగు సదస్సులో పాల్గొన్నాడు. ముంబయిలో ఆంధ్ర మహా సభ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు ఉత్సవాలులో ప్రదర్శన ఇచ్చాడు. 2015లో దుబాయిలో జరిగిన గల్ఫ్ తెలంగాణ సాంస్కృతిక సంబురాలులో పాల్గొన్నాడు. జానపదులతో జనాన్ని ఉర్రూతలూగించాడు.
పల్లె ప్రజలను పాటలతో ఆకట్టుకుంటున్న జంగిరెడ్డిని ఎన్నో అవార్డులు, పురస్కారాలు అందుకున్నారు. 1993లో కర్నూలు జిల్లా నంద్యాలలో నందిని కళానికేతన్‌లో ఎంజిజి రాజు మెమోరియల్ అవార్డును జంగిరెడ్డికి బహూకరించారు. 1995లో కరీంనగర్ జిల్లా జగిత్యాలలో గానకోకిల కళా నిలయం వారు జానపద కోకిల అవార్డుతో సత్కరించారు. కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలో బెస్ట్ యాక్టర్, బెస్ట్ రైటర్ అవార్డును పోలీస్ అకాడెమీ ప్రకటించింది. 2004లో మహబూబ్‌నగర్ జిల్లా యూత్ సర్వీస్ ఉత్తమ గాయకుడిగా ఎంపిక చేసింది. 2007లో మలేషియా తెలుగు సంఘం ఉగాది పురస్కారాన్ని అందజేసింది. 2008లో హైదరాబాద్‌లోని శిల్పారామంలో శిల్ప అవార్డుతో సత్కరించింది. 2009లో పాలమూరు జిల్లా వనపర్తిలోని స్వర్ణముఖి ఆర్ట్స్ అకాడెమీ ఉగాది పురస్కారంతో సన్మానం చేసింది. అదే ఏడాది హదరాబాద్‌లోని శ్రీ సుధా ఆర్ట్స్ జానపద రత్న అవార్డును బహూకరించింది. 2010లో తెలుగు విశ్వ విద్యాలయం కీర్తి పురస్కారాన్ని ప్రకటించింది. 2011లో విక్రమ్ ఆర్ట్స్ జానపద రత్నతో , 2012లో ఒంగోలులోని ఘంటసాల మ్యూజికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పౌర పురస్కారం ప్రకటించింది.
ఇదే ఏడాది కరీంనగర్ జిల్లా హుస్నాబాద్‌లోని తెలంగాణ ఆత్మబంధువు సామాజిక సేవా మరియు కళా సంస్థ ఆధ్వర్యంలో ఆత్మబంధువు పురస్కారం, 2013లో డెహ్రాడూన్‌లోని దేవభూమి తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉగాది పురస్కారం, 2014లో నరసింహ మూర్తి మెమోరియల్ అవార్డు జానపద బ్రహ్మ పేరుతో సన్మానం చేసింది. 2015లో జగిత్యాలలోని గాన కోకిల కళానికేతన్ సంస్థ కళా పరిపూర్ణ అవార్డును, అదే ఏడాది బిటివి వైద్య రత్న అవార్డును బహూకరించింది. కరీంనగర్ ఫోక్ ఆర్ట్స్ అకాడెమీ ఉగాది పురస్కారంతో సత్కరించింది. 2016లో మాధాపూర్‌లోని హైటెక్స్ లో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ నరసింహన్ ఉత్తమ జానపద గాయకుడిగా ప్రకటించింది ఘనంగా సన్మానం చేసింది. ముఖ్యమంత్రులు కోట్ల విజయ భాస్కర్ రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావులతో పాటు పలువురు ఉన్నత స్థాయి వ్యక్తులు, సంస్థలు జంగిరెడ్డిని సత్కరించాయి..సన్మానించాయి. పాలమూరు పోరగాడు ..పాటగాడు మరిన్ని పాటలతో ఆకట్టు కోవాలని ..అలరించాలని..ఇలాగే పాడుతూ ఉండాలని కోరుకుందాం.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి