యాయిరే ..యాయిరే..రంగీలా..రే..!
తెలుగువాడి దమ్ము ఏమిటో..టాలెంట్ ఏమిటో..క్రియేటివిటీ అంటే ఎలా వుంటుందో ప్రపంచానికి తెలియ చెప్పిన ఒకే ఒక్కడు రాం గోపాల్ వర్మ. శివ సినిమాతో తెలుగు సినిమా రంగాన్ని కొత్త పుంతలు తొక్కించిన ఈ దర్శకుడి దెబ్బకు ఒక్కసారిగా హిందీ సినిమా కుదుపులకు లోనైంది. జాతి యావత్తు మొదటిసారిగా ..మెయిన్ స్ట్రీమ్‌లో తీసిన ఈ మూవీ కొత్త రికార్డులను తిరగ రాసింది. ఒకే మూస ధోరణికి అలవాటు పడిన సినీ ప్రేక్షకులను ముఖ్యంగా ముంబయిని రఫ్ఫాడించింది. వసూళ్లలో బాక్సాఫిస్ బద్దలు కొట్టింది. కోట్లు కుమ్మరించేలా చేసింది. కంటెంట్ పరంగా ..స్క్రీన్ ప్లే పరంగా..మ్యూజిక్ పరంగా ఎంతో ఉన్నత స్థాయికి తీసుకు వెళ్లిన ఘనత ఒన్ అండ్ ఓన్లీ డైనమిక్ డైరెక్టర్ వర్మకే దక్కుతుంది. తన సంగీతంతో మెస్మరైజ్ చేసిన ఘనత అల్లా రఖా రెహమాన్ మొదటిసారిగా హిందీ సినిమా రంగంలోకి ప్రవేశించారు. తన పవర్ ఏమిటో ఇండియన్స్‌కు తెలియ చెప్పారు. హీరోయిజం ..మేనరిజం చట్రంలో ఇరుక్కు పోయిన హీరో, హీరోయిన్లను మాస్ వరకు తీసుకు పోయాడు.
ముంబయిని ఏకఛత్రాధిపత్యంతో ఏలుతున్న సినీ దిగ్గజాలను కోలుకోలేకుండా చేశాడు వర్మ. ఆయన ఇచ్చిన షాక్ కు సినిమా ఇండస్ట్రీ కొత్తగా ఆలోచించేలా చేసింది. క్రియేటివిటీ కలిగిన ఎందరికో అవకాశాలు ఇచ్చాడు. తనకంటూ ఏకంగా ఓ స్వంత టీంను ఏర్పాటు చేసుకున్నాడు. అనామకులను అందలం ఎక్కించాడు. కొందరి చేతుల్లో ఉన్న ఇండస్ట్రీని మొత్తం తన వైపు తిప్పుకునేలా చేశాడు. వర్మలోని టాలెంట్‌ను చూసి లోకం ఆశ్చర్య పోయింది. ఎక్కడో ఉన్న ఊర్మిళా మండోట్కర్‌ను ఒకే ఒక్క సినిమాతో ఇండియాలో టాప్ వన్ హీరోయిన్‌గా రాత్రికి రాత్రే మార్చేశాడు. అంతేనా తన మ్యూజిక్‌తో మ్యాజిక్ చేసే రెహమాన్‌కు ఛాన్స్ ఇచ్చాడు. మెయిన్ రోల్స్ లలో అమీర్ ఖాన్, జాకీష్రాఫ్‌తో పాటు ఊర్మిళ నటించారు. ఝామూ సుగంధ్ , రాం గోపాల్ వర్మ లు ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరించారు. సినిమాటోగ్రఫి డబ్ల్యు.బి.రావ్, ఈశ్వర్ నివాస్ ఎడిటింగ్ చేపడితే వర్మ క్రియేషన్స్ పేరుతో 8 సెప్టెంబర్ 1995న దేశ వ్యాప్తంగా విడుదల చేశారు. 90 నిమిషాల నిడివి కలిగిన ఈ మూవీ ఊహించని రీతిలో భారీ కలెక్షన్లను రాబట్టింది.
45 మిలియన్ల రూపాయలతో సినిమాను నిర్మించారు. 1.4 బిలియన్ డాలర్లను రాబట్టింది. రొమాంటిక్ మ్యూజికల్ కామెడీగా ఈ సినిమాను తీర్చిదిద్దాడు రాం గోపాల్ వర్మ. ఒరిజినల్ సౌండ్ ట్రాక్ తో నేరుగా అందించిన మ్యూజిక్ యూత్ హృదయాలను గిలిగింతలు పెట్టింది. సినీ సంగీతపు దృవతారగా వెలుగొందుతున్న ఆషా భోంస్లేతో రెహమాన్ చేసిన సాంగ్..ఇండియాతో పాటు ప్రపంచాన్ని ఊపేసింది.. ఊగి పోయేలా..చేసింది. ఆ ఒక్క పాట రింగ్ టోన్లుగా..ఆల్బం చార్ట్‌లలో టాప్ వన్‌గా నిలిచేలా చేసింది. అంతకు ముందు రెహమాన్ సంగీత దర్శకత్వం వహించిన సినిమాలన్నీ హిందీ, మలయాళం, తెలుగులోకి డబ్ అయ్యాయి. భారీ వసూళ్లను మూటగట్టుకున్నాయి. కానీ ఈ మ్యూజిక్ దిగ్గజాన్ని వర్మ నేరుగా రంగీలాకు తీసకు వచ్చాడు. మాఫియా ఓ వైపు..శివసేన ఇంకో వైపు..నిత్యం అల్లకల్లోలంగా మారిన దేశంలో ..వర్మ రిలీజ్ చేసిన రంగీలాతో జాతి యావత్తు ఉలిక్కి పడింది.
ఊర్మిల అందం..ఆషా స్వరం..అల్లా రఖా సంగీతం..దర్శకుడి అత్యుత్తమమైన ప్రతిభ..వెరసి తూటాలకంటే బలమైన మాటలు..ఊర్మిళ అందాల ఆరబోత..అమీర్ చిలిపితనం..జాకీ ష్రాఫ్ నడత..ఇలా చెప్పుకుంటూ పోతే ..యాయిరే యాయిరే జోర్ లగాకే నాచోరే..అంటూ చేసిన మ్యాజిక్‌కు జనం ఫిదా అయ్యారు. అందులో తమను తాము చూసుకున్నారు. సినిమాలో ఏం ఉంటుందని పెదవి విరిచిన హిందీ సినీ ప్రముఖులు, టెక్నిషియన్లు, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు దిమ్మ తిరిగేలా చేశాడు..వర్మ. ఇంకేం వర్మ ఏది చేసినా ఓ సంచలనమే అయ్యింది. ఆయన ఏది మాట్లాడినే అది ఓ చరిత్రగా మారింది. తెలుగులో శివ ట్రెండ్‌కు ఆద్యుడైన వర్మ..హిందీ రంగాన్ని కొన్నేళ్ల పాటు శాసించాడు..తనకంటూ పర్మినెంట్ స్పేస్‌ను క్రియేట్ చేసుకున్న ఘనుడు రామ్. జాతీయ , అంతర్జాతీయ స్థాయిలలో రంగీలాకు ప్రశంసలు వచ్చాయి. హాలీవుడ్‌లో ఈ సినిమా ఆడడం వర్మ పనితనానికి ఓ మచ్చుతునక. ఏడు ఫిలిం ఫేర్ అవార్డులను మూవీ స్వంతం చేసుకుంది.
బెస్ట్ యాక్టర్ సపోర్టింగ్ రోల్ పోషించిన జాకీ ష్రాఫ్ ..బెస్ట్ కొరియోగ్రఫీ అవార్డును అహ్మద్ ఖాన్, బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనింగ్ ను మనీష్ మల్హోత్రా, బెస్ట్ స్టోరీ రైటర్‌గా డైరెక్టర్ వర్మ, బెస్ట్ మ్యూజిక్ అందించినందుకు గాను రెహమాన్ పురస్కారం అందుకున్నారు. ఆర్‌డి బర్మన్ అవార్డును మెహబూబ్ పొందగా స్పెషల్ జ్యూరీ అవార్డును ఆషా భోంస్లే ఉత్తమ నేపథ్య గాయనిగా అవార్డు పొందారు. సినిమా థియేటర్ల వద్ద బ్లాక్‌లో టికెట్లు అమ్మే పాత్రలో అమీర్ చక్కగా నటించగా ఊర్మిళ హీరోయిన్ రోల్‌లో అదరగొట్టింది. ఊర్మిళకు సినిమాల్లో నటించాలని కోరిక. డ్యాన్సులు చేయడం వృత్తి. రాజ్ కమల్ పాత్రలో ఒదిగిన జాకీ రంగీలా పేరుతో సినిమాలో నటింప చేస్తాడు. ఇందులో మున్నా అండ్ రాజ్ పాత్రలు చేశారు. రాజ్‌తో ఎక్కువగా టైం గడపడం మున్నా గమనించాడు. తాను ప్రేమిస్తున్నట్లు చెప్పినా ఊర్మిళ పట్టించుకోదు. తనకు సినిమాలు కావాలి..ఈ అందమైన లోకంలో విహారం చేయాలి. మున్నా ఓ సాధారణమైన వ్యక్తి. తాను ఈమెకు తగను అన్న భావనలోకి వచ్చేస్తాడు అమీర్ ఖాన్. ఇద్దరి మధ్య ఎలాంటి పొరపొచ్చాలు లేకుండా కలిసి పోతారు. చివరికి సినిమా ముగుస్తుంది.
ఇందులో ట్విస్టులుండవు..భారీ డైలాగులు అంతకన్నా వుండవు..పెద్ద పెద్ద క్యాస్టూమ్స్..హంగామాలు అసలే వుండవు. మనం నిజ జీవితంలో ఎట్లా వుంటామో..మనకెలాంటి భావోద్వేగాలు ఉంటాయో..వాటినే సెల్యూలాయిడ్ మీద ప్రతిఫలింప చేశాడు..అనడం కంటే ప్రాణం పోశాడనడంలో సందేహం లేదు. సినిమా రంగంలోని 24 ఫ్రేమ్‌ల గురించి అలవోకగా చెప్పేయగల దర్శకుల్లో హాలీవుడ్ తర్వాత ఇండియాలో ఒక్కడే ..వర్మ. నీషేను..ఓషోను ..ఫిలాసఫీని ..లైఫ్‌ను..సొసైటీని..లోకాన్ని దగ్గరుండి చూశాడు. కనుకే కొన్ని వందల మందికి జీవితాన్నిచ్చాడు. తనకు ఏం కావాలో ..తాను ఏం చెప్పాలనుకున్నాడో అదే తీసుకుంటూ పోయాడు. మరిచి పోలేని సినిమాలున్నాయి. అమీర్‌తో రంగీలా..అమితాబ్‌తో సర్కార్..రంగీలా రిలీజ్ అయ్యాక బాక్సాఫీస్ బద్దలు కొట్టింది. భారీ విజయాన్ని నమోదు చేసుకున్నా ..మంచి పేరు వచ్చినా ఎందుకనో దానిని పట్టించుకోలేదు వర్మ. తన లోకంలో తానుండి పోయాడు.
ఒక్కడే ఎంటర్ అయ్యాడు..ఓ సామ్రాజ్యాన్ని ముంబయిలో ఏర్పాటు చేశాడు. అందరూ మాఫియా మీద భయపడితే..తన శిష్యుడితో దావూద్ ఇబ్రహీంపై డి పేరుతో సినిమా తీశాడు. కంపెనీ, సత్య సినిమాలు హిందీ పరిశ్రమను కదిలించాయి. సినిమాలను ఈ రకంగా కూడా ప్రజెంట్ చేయొచ్చా అన్నంత స్థాయికి తీసుకు వచ్చాడు వర్మ. తన్హా..తన్హా ..రంగీలారే..అంటూ ఊర్మిళ డ్యాన్సులతో అదరగొట్టింది. అద్భుతం అనేలా చేసింది. డిజైనర్ మనీష్ మల్హోత్రాకు ఎనలేని ఫేం తీసుకు వచ్చింది ఈ మూవీ. ఇండియాలో హీరోయిన్ ఎక్కడికి వెళ్లినా టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారి పోయింది. అంతలా తీర్చిదిద్దాడు దర్శకుడు. అహ్మద్ ఖాన్, సరోజ్ ఖాన్‌ల కొరియో గ్రఫీ ఫ్యాన్స్‌ను మళ్లీ మళ్లీ రప్పించేలా చేసింది. ముంబయి దారుల్లో..సముద్రపు అలల సవ్వడిలో ..ఓ నక్షత్రం అలా వచ్చి ఇలా వెళ్లినట్టు ఊర్మిళ సోయగాల గమ్మత్తుతో మళ్లీ మళ్లీ చూసేలా చేసింది.
టిప్స్ మ్యూజిక్ కంపెనీ పాటల్ని విడుదల చేసింది. ప్లానెట్ బాలీవుడ్ 4 పాయింట్లకు 4 పాయింట్లు ఇచ్చింది. అక్షరాలతో ప్రేమ పువ్వులు పూయించే మెహబూబ్‌ను ఎంచుకున్నాడు రెహమాన్. ఇంకేం యూత్ కు కావాల్సినంత జోష్ వచ్చేలా రాశాడు మెహబూబ్. తన కలానికి మరింత పదును పెట్టాడు. పాటలకు ప్రాణం పోశాడు. టాప్ చార్ట్స్‌లో నిలిచేలా రెహమాన్ తీర్చిదిద్దాడు. బాలీవుడ్‌లో ఆ ఏడాదిలో అన్ని చోట్లా టాప్ వన్‌లో ఈ సినిమా పాటలు నిలిచాయి. మ్యూజిక్ డైరెక్టర్ పనితనం చూసి బాలీవుడ్ నివ్వెర పోయింది. ఇదంతా వర్మ చలవే. పాటల రచయిత మెహబూబ్ పలు అవార్డులు పొందారు. స్వేతా శెట్టి, కవితా కృష్ణమూర్తి లు సింగర్స్ కేటగిరీలో ఫిలిం ఫేర్ అవార్డుకు ఎంపికయ్యారు. ఆషా భోంస్లే తన్ హా తన్ హా సాంగ్ కు స్పెషల్ కేటగిరీ కింద అవార్డు దక్కించుకున్నారు. రంగీలారే పాటను ఆషా, ఉదిత్ నారాయణ్ పాడితే, హై రామా పాటను హరిహరన్, స్వర్ణలత పాడారు.
క్యా కరే క్యా నా కరే సాంగ్‌ను ఉదిత్ , ప్యార్ యే జానే కైసా సాంగ్‌ను కవితా, సురేష్ పాడగా ..యారో సున్‌లో జరా పాటను ఉదిత్, చిత్ర పాడారు. మాంగ్తా హై క్యా సాంగ్‌ను శ్వేతా శెట్టి, ఏ ఆర్ రెహమాన్ పాడారు. రొమాన్స్, మ్యూజిక్, కామెడీ కలిస్తే రంగీలా సినిమా. 21వ శతాబ్దంలో మ్యూజిక్ పరంగా గొప్ప చిత్రంగా రంగీలాను అభివర్ణించారు శేఖర్ కపూర్. వర్మ కెరీర్‌లో అత్యుత్తమమైన సినిమాగా నిలిచి పోతుంది. కావాల్సినంత ఆనందం..చెప్పలేనంత సంతోషం..ఒక తరానికి కావాల్సినంత జోష్ రావాలంటే ..రంగీలా చూడాల్సిందే. అంతలా మనల్ని మనం మైమరిచి పోతాం. సినిమా చూశాక..మనల్ని మనం ప్రేమించుకుంటాం. ఇదీ ఈ సినిమాకున్న గొప్పతనం..!
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి