పర్‌దేశి ..పర్‌దేశి జానా నహీ..ముజే ఛోడ్ కే..!
!...నువ్వు వెళ్లిపోతే నేనుండ లేను. సమస్తం నువ్వైనప్పుడు నేను నేనుగా ఎలా వుండగలను..? గుండె నిండా నువ్వే నిండి పోయినప్పుడు ..నా అడుగుల్లో నీ సవ్వడి వింటున్నప్పుడు ..నా ఆలోచనల్లో నువ్వు తచ్చట్లాడుతున్నపుడు ..నీ తలపుల్లో నా తనువు మమేకమైనప్పుడు..సమస్తమంతా నీ జ్ఞాపకాలు తోడేస్తుంటే..నేను మనిషిగా ఎలా వుండగలను..? ఇలా హృదయాలను కట్టి పడేసి..కన్నీళ్లు చెమర్చేలా చేసిన అద్భుతమైన సినిమా రాజా హిందూస్తానీ...!
భారతీయ సినిమా చరిత్రను ఈ మూవీ తిరగ రాసింది. బాక్సాఫీసు వద్ద వసూళ్లలో కొత్త ట్రెండ్ సృష్టించింది. ఈ మూవీ అటు అమీర్ ఖాన్‌ను ఇటు కరిష్మా కపూర్‌లకు జీవితాంతం మరిచి పోలేని విజయాన్ని అందించింది. ఇదంతా ఆ సినిమాకు ప్రాణం పెట్టి..అహోరాత్రులు కష్టపడి వెండితెర మీద ఆవిష్కరించిన ఘనత ఒక్కడికే దక్కుతుంది..అతడే దర్శకుడు దర్మేష్ దర్శన్. 1996 నవంబర్ 15 దేశ వ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేశారు.
పేద కుటుంబానికి చెందిన కారు డ్రైవర్..సంపన్న కుటుంబానికి చెందిన అమ్మాయి ప్రేమలో పడితే ఏం జరుగుతుందనే దానిపై స్టోరీ లైన్‌ను తీసుకుని దీనిని తీశాడు. ప్రేమిస్తే ఏమవుతుంది..ఏం చేస్తే కోరుకున్న ఆమె దక్కుతుంది..ఆస్తులు..అంతస్తులు ఇవేవీ అడ్డుకాదని తెరపై నిరూపించారు హీరో హీరోయిన్లు. కెమిస్ట్రీ పండింది. యువత హృదయాలను కొల్లగొట్టింది. అన్ని వర్గాల ప్రేక్షకుల మనసు దోచుకుంది ఈ సినిమా. పాటల చెలికాడు సమీర్ తన కలానికి మరింత పదును పెట్టాడు. జీవితాంతం నెమరు వేసుకునేలా పాటలను ఇచ్చాడు. 1990వ దశకంలో రాసిన ప్రతిపాట హిట్‌గా నిలిచింది. ఈ సినిమాకు అతడే హీరో. ప్రతి పాట ఒక ఆణిముత్యం. హీరో ..హీరోయిన్ల మధ్య ..నడిచే ప్రేమ..దానిని వ్యక్త పరిచేందుకు కావాల్సినంత స్పేష్‌ను క్రియేట్ చేసి..ప్రియుడు..ప్రియురాలి మధ్య జరిగే అంతర్లీనమైన సంభాషణలకు రూపమిచ్చారు సమీర్. అదే పర్‌దేశి పర్‌దేశి జానా నహీ. ఆల్ టైం రికార్డులను తిరగ రాసింది ఈ పాట. ఇండియాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా డాలర్లను కొల్లగొట్టింది.
దర్శకుడి ప్రతిభ..సంగీత దర్శకుల కసి ..కవి సమీర్ కలం జోడవ్వడంతో సక్సెస్ టాక్ తెచ్చుకుంది. అయిదు ఫిలిం ఫేర్ అవార్డులతో పాటు ఏడు స్క్రీన్ అవార్డులను స్వంతం చేసుకుందీ ఈ సినిమా. 57.5 కోట్ల బడ్జెట్‌తో సినిమా తీస్తే..ఏకంగా 763.4 మిలియన్ల డబ్బులు వసూలయ్యాయి. ఇదో రికార్డు. ఆ ఏడాదిలో అత్యధికంగా వసూళ్లు చేసిన సినిమాగా రాజా హిందూస్థానీ సినిమా నిలిచింది. రాజా హిందూస్తానీ పాత్రలో అమీర్..ఆర్తి సెహగల్ పాత్రలో కరిష్మా ..ప్రేమికులుగా ఒదిగి పోయారు. రొమాన్స్‌ను..లవ్‌ను పండించారు. అత్యుత్తమంగా నటించినందుకు ఉత్తమ నటిగా అవార్డు పొందారు. పలు ప్రశంసలు అందుకున్నారు. కన్నడలో ఈ సినిమాను రిమేక్ చేసి 2002లో విడుదల చేశారు. ఇందులో ఉపేంద్ర, సాక్షి శివానంద్ లీడ్ రోల్స్‌లో నటించారు. 2005లో ఒరియాలో ప్రియా మో ప్రియా పేరుతో రిలీజ్ చేశారు. మిస్టర్ సెహగల్ తండ్రి పాత్రలో సురేష్ ఒబేరాయ్ నటించగా ..పిన తల్లి శాలిని పాత్రలో అర్చనా పూర్ణిమా సింగ్ పోషించారు.
వెకేషన్ కోసమని పాలనఖేట్ కు వెళ్లాలని నిర్ణయించుకుంటుంది ఆర్తి. అక్కడ ఎయిర్‌పోర్ట్ లో దిగాక ..ట్యాక్సీ మాట్లాడుకుని బయలు దేరుతుంది. తాను వెళ్లాల్సిన చోటికి ఒకే ఒక్క కారుండడం..అది అమీర్ ఖాన్ మాత్రమే ఉండడం..వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించేలా దర్శకుడు చేశాడు. ఈ సమయంలోనే వీరిద్దరి మధ్య గాఢమైన అనుబంధం ఏర్పడుతుంది. అది ఎంత దాకా అంటే మనసులు కలిసే దాకా..ఇంక మరణం సంభవించినా కలిసి ..మట్టిలో కలిసి పోయేంత దాకా..వీడని బంధం గురించి ఆర్తి తన తండ్రితో చెబుతుంది. అతను ఒప్పుకోడు. నువ్వెక్కడ..అతనెక్కడ. ఇక్కడ వుంటే కుదరదు. ముంబయికి రమ్మను. అక్కడ సొసైటీలో నాలాగా గౌరవప్రదమైన పేరు తెచ్చుకోమను..అప్పుడైతే ఒప్పుకుంటా..ప్రేమ లేదు..అంటూ కోప్పడతాడు. తండ్రిని వేడుకుంటుంది..ఒక్కసారి పాలన్‌ఖేట్‌కు వెళతానని ..కొత్త భవనాన్ని ఇస్తానని అమీర్‌ఖాన్‌కు ఆఫర్ చేస్తాడు ఆర్తి తండ్రి ఒబేరాయ్. దానిని తీసుకునేందుకు రాజా ఒప్పుకోడు. ఆత్మాభిమానం అడ్డు వస్తుంది.
ఇదే సమయంలో పినతల్లి షాలిని ..తమ్ముడు, వారి బంధువులు వీరి మధ్య పొరపొచ్చాలు వచ్చేలా చేస్తారు. ఇదంతా ఆస్తులు కొట్టేయాలని ప్లాన్. ఆర్తి, రాజా వేరు పడేలా చేస్తారు. ఆర్తి కడుపుతో ఉంటుంది..కష్టమైనా సరే ప్రయాణం చేయాలని అనుకుంటుంది. ఆర్తి నీకు విడాకులు ఇవ్వాలని అనుకుంటోంది..అంటూ రాజాకు కబురు పంపిస్తుంది. దానిని రాజా తిరస్కరిస్తాడు. పండంటి బిడ్డకు జన్మనిస్తుంది. రాజా బిడ్డను తీసుకెళతాడు. పినతల్లి చేసిన మోసం గుర్తించి..అమీర్, కరిష్మా ఒక్కటవుతారు. దీంతో కథ సుఖాంతమవుతుంది..సినిమా ఆద్యంతమూ రక్తి కట్టిస్తూనే..ప్రేమను ఆవిష్కరిస్తుంది. ఇంతటి మహత్తు కలిగేలా చేసిన దర్శకుడు దర్మేష్ ధావన్‌ను అభినందించకుండా వుండలేం. సినిమాకు పాటలు ఓ వైపు..సంభాషణలు మరో వైపు విజయం సాధించడంలో కీలక భూమిక పోషించాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌తో పాటు పాటల్లోని మాధుర్యాన్ని మరోసారి తమ మార్క్ సంగీతం జోడించి రిలీజ్ చేసిన నదీం శ్రవణ్‌ల గురించి ఎంత చెప్పినా తక్కువే.
కల్పనా అయ్యర్‌తో పాటు ప్రతిభా సిన్హా పర్ దేశి ..పర్ దేశి జానా నహీ ..సాంగ్‌లో ప్రత్యేకంగా కనిపిస్తారు. ఆ ఒక్క పాట సినిమాను అనుకోని రేంజ్‌కు తీసుకు వెళ్లేలా చేసింది. ఏ నోట విన్నా..ఎక్కడికి వెళ్లినా..ఏ కారులో ఎక్కినా..అంతటా ఆ సాంగే. ఉర్రూత లూగించింది..ఊగి పోయేలా చేసింది. మళ్లీ మళ్లీ పాడుకునేలా..కన్నీళ్లు పెట్టించేలా చేసింది. పాటల కోయిలమ్మ ఆల్కా యాజ్ఞిక్, ఉదిత్ నారాయణ్, స్వప్నా అవస్తీ, కుమార్ సాను పాటలకు జీవం పోశారు. టి మ్యూజిక్ కంపెనీ పాటల్ని విడుదల చేసింది. ఊహించని రీతిలో రికార్డు స్థాయిలో ఆల్బంలు, క్యాసెట్లు అమ్ముడు పోయాయి. అన్ని చోట్ల ఆల్ టైం ..టాప్ వన్ సాంగ్స్ కేటగిరీలలో..చార్ట్‌లలో రాజా హిందూస్తానీ మూవీ సాంగ్స్ నిలిచాయి. ఇదో రికార్డుగా నిలిచి పోయింది ఇండియన్ సినిమాలో.
బాలీవుడ్‌లో 100 అత్యుత్తమ పాటలను ఎంపిక చేస్తే..అందులో పర్‌దేశి..పర్‌దేశి సాంగ్ కూడా ఒకటి. బెస్ట్ మేల్ సింగర్‌గా ఉదిత్ నారాయణ్ పలు అవార్డులు స్వంతం చేసుకున్నారు. ప్లానెట్ బాలీవుడ్ మొదటి సారిగా 10 పాయింట్లకు గాను 9.5 పాయింట్లను కేటాయించింది ఈ సినిమా సాంగ్స్‌కు. ఇదో రికార్డు. 11 మిలియన్ల కాపీలు అమ్ముడు పోయాయి. ఆషిఖి, దిల్ తో పాగల్ హై లతో పాటు ఈ మూవీ కూడా పోటీ పడింది. వీరితో పాటు అలీషా చినాయ్, స్వప్నా ముఖర్జీ, సురేష్ వాడ్కర్, బేలా సులేఖా కూడా పాడు. ఒకే ఒక్క పాటను ఒక్కొక్కరితో పాడించారు సంగీత దర్శకులు. ఇది డైరెక్టర్‌కు సంగీతం పట్ల..పాటల పట్ల..ప్రేమ పట్ల ఉన్న మక్కువను తెలియ చేస్తుంది. అన్ని కేటగిరీలలో ఈ సినిమాకు పనిచేసిన వారందరికీ పురస్కారాలు, అవార్డులు లభించాయి. సినిమా విడుదలై రెండు దశాబ్ధాలు గడిచినా ..ఇంకా మదిలో మోగుతూనే ఉన్నది. అవును..జగతి ఉన్నంత దాకా..ప్రేమ బతికి ఉన్నంత దాకా.. నిలిచే వుంటుంది..గుండెల్ని కదిలిస్తూనే ఉంటుంది. షుక్రియా దర్మేష్ దర్శన్..!
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి