మళ్లీ జన్మిస్తావా..దేవానంద్ ..!
నిద్రలో కలవరించే అందం ఆయన స్వంతం. అతడే జగమెరిగిన..జనం మెచ్చిన ..ఎవర్ గ్రీన్ హీరో..దేవానంద్. ఆ ముగ్ధ మనోహరమైన రూపం ఆయనకు మాత్రమే స్వంతం. ప్రకృతి విప్పారినట్టు..పూలన్నీ ఒకే చోట వాలినట్టు..ఎంతటి అద్భుతమైన..ఆకర్షణీయమైన..రమణీయమైన శరీరం..పడుకుంటే..కిటికీ పక్కన తొంగి చూస్తే..గాలి తెమ్మెరలు తాకుతుంటే..ప్రియురాలి ముంగురులు కళ్లను..వాకిళ్లను..చూపుల్ని కట్టి పడేస్తుంటే..అపుడు లయాత్మకంగా ..గైడ్ సినిమా హత్తుకుంటుంది. ఎవరూ లేకుంటే బావుండనిపిస్తుంది..ఏకాంతంలో ఒక్కళ్లమే ..గదిలో తచ్చట్లాడుతుంటే..దేవానంద్ పలకరిస్తాడు..పలవరించేలా చేస్తాడు..అదీ ఆయన స్పెషాలిటీ..భౌతికంగా లేరు..కానీ మానసికంగా ఆ సమ్మోహన భరితమైన ..ఎల్లవేళలా వసంతంలా ..చిగురించే కొమ్మల్లా ..ఆ నవ్వు ..అన్నింటిని కదిలిస్తుంది..అందమంటే ఏమిటి..ఆకర్షణా కాదు అదో అనిర్విచనీయమైన అనుబంధం. గాతా రహే మేరా దిల్ ..అంటూ పిల్లతెమ్మరలా కిషోర్ కుమార్..లతా మంగేష్కర్ లు పాడుతూ వుంటే..దేవానంద్ అభినయం అద్వితీయం..అజరామరం. భారతీయ సినిమా ఫ్లాట్ ఫాంలో చెరగని ముద్ర వేసుకున్న సినిమా అదొక్కటే. టైమ్స్ చార్ట్ లో టాప్ ఫైవ్ లో గైడ్ శాశ్వతంగా నిలిచి పోయింది.
పంజాబ్ లోని గురుదాస్ పూర్‌లో 1923లో ధరందేవ్ పిశోరిమల్ ఆనంద్ అలియాస్ దేవానంద్ జన్మించారు. వృత్తి పరంగా నటుడిగా..చిత్ర నిర్మాతగా..విజయవంతమైన దర్శకుడిగా వినుతికెక్కారు. హిందీ సినిమా పరిశ్రమలో దేవానంద్ అంటేనే ..పూల పరిమళం. ఏళ్లు గడిచినా యవ్వనవంతుడిగానే ఉన్నాడు. తనువు చాలించేంత వరకు అలానే మెయింటెనెన్స్ చేస్తూ వచ్చాడు. ఇదీ ఆయన సాధించిన ఫీట్. జీవితాన్ని దేవానంద్ ఎంజాయ్ చేసినంత ఏ ఇండియన్ హీరో చేయలేదు. లైఫ్‌ను ప్రేమించాడు. తానే ప్రేమికుడిగా మారాడు. సాహిత్యమన్నా, సంగీతమన్నా ఆయనకు చచ్చేంత ఇష్టం. ఏది మాట్లాడినా చాలా అర్ధవంతంగా వుండేది. యువతుల కలల రాకుమారుడిగా..ప్రేమికుడిగా ..ఆదరణీయ నటుడిగా ..రొమాంటిక్ హీరోగా పేరు తెచ్చుకున్నారు.
ఆహార్యంలోను..మాటల్లోను..చేతల్లోను..నడకలోను..ప్రతి సందర్భంలోను దేవానంద్ తనదైన స్టైల్‌ను మెయింటెనెన్స్ చేస్తూ వచ్చారు. తానే ఓ బ్రాండ్ గా మార్చేశాడు. ఓ సందర్భంలో ఈ యవ్వన సీక్రెట్ ఏమిటని అడిగితే..జీవితం ప్రేమమయం కదా అని బదులిచ్చాడు దేవానంద్. ప్రేమ మనిషిని బతికిస్తుంది..గొప్పగా బతికేలా చేస్తుంది అనటానికి ..ప్రత్యక్ష ఉదాహరణ ..దేవానంద్. 1948 నుంచి 1951 దాకా గాయని నటి సురయ్యాతో కలిసి ఆరు సినిమాలలో నటించారు. 1948లో విద్య చిత్రం లోని కినారె కినారె చల్ జాయెంగె పాట చిత్రీకరణ సమయంలో ..పడవ మునిగిప్పుడు ..నీటిలో పడి మునిగి పోతున్న సురయ్యాను దేవానంద్ రక్షించాడు. ఆ అద్భుతమైన సౌందర్యరాశి ప్రేమను చూరగొన్నాడు. జీత్ మూవీ చిత్రీకరణ సమయంలో దేవానంద్ తన ప్రేమను వ్యక్త పరిచాడు.
వీరి ప్రేమకు సురయ్యా తల్లి సానుకూలంగా స్పందించినా..హిందువైన దేవాతో పెళ్లేమిటంటూ ఆమె అమ్మమ్మ అడ్డు చెప్పింది..దీంతో ఈ స్వచ్ఛమైన ప్రేమికుడి గుండె గాయపడింది. దివేచా అనే సినీ ఛాయా చిత్రకారుడి ద్వారా సురయ్యాకు వజ్రంతో పొదిగిన ఉంగరాన్ని పంపించాడు. దేవానంద్ ను పెళ్లి చేసుకుంటే తామంతా చనిపోతామంటూ కుటుంబం బెదిరించింది. దీంతో తీసుకున్న ఉంగరాన్ని సముద్రంలో విసిరేసింది సురయ్యా. తట్టుకోలేక పోయాడు ఈ ప్రేమికుడు. 1951లో దో సితారె సినిమా ఆఖరి సినిమా. ఇద్దరూ కలిసి చివరి సారిగా నటించారంతే. వీరిద్దరి మధ్య మొగ్గతొడిగిన ప్రేమ..చివరి వరకు సురయ్యా జీవితాంతం పెళ్లికి నోచుకోకుండా పోయింది. ఆమె 2004 సంవత్సరంలో 75వ ఏట ముంబయిలో కను మూసింది. విఫలమైన ప్రేమను తలుచుకుంటూ ..మరింత నటనపై దృష్టి పెట్టాడు దేవానంద్.
తన సహ నటి కల్పనా కార్తిక్ తో ప్రేమలో పడ్డాడు. టాక్సీ డ్రైవర్ మూవీ షూటింగ్ జరుగుతున్నప్పుడు..మధ్యాహ్న భోజన విరామ సమయంలో దేవానంద్ పెళ్లి చేసుకున్నాడు. అప్పుడు దేశ వ్యాప్తంగా అదో సంచలనమైన వార్తగా నిలిచింది. పెళ్లి..చావు రెండూ వ్యక్తిగతమైనమని గట్టిగా విశ్వసించే దేవానంద్ తన పెళ్లిని నిరాడంబరంగా ..అతి కొద్ది మంది వ్యక్తుల మధ్య చేసుకున్నాడు. ముస్లిం అయిన సురయ్యాతో వివాహానికి మతం అడ్డొస్తే..క్రిష్టియన్ అయిన మోనాసింగ్‌తో పెళ్లికి మతం అడ్డురాలేదు..ఇదీ విచిత్రం. వీరిద్దరికి ఇద్దరు సంతానం. కొడుకు సునీల్ ఆనంద్, కూతురు దేవిన. సునీల్ ఆనంద్ ఆనంద్ ఔర్ ఆనంద్ చిత్రంతో నటన ప్రారంభించి..మరో మూడు చిత్రాలు చేశాడు..ఆయన సక్సెస్ కాలేదు. నవకేతన్ సంస్థ చిత్ర నిర్మాణ నిర్వహణ చూస్తున్నారు.
దేవానంద్ పేరు ప్రపంచమంతటా వ్యాపించేలా చేసిన చిత్రం ఆర్కే నారాయణ్ రాసిన ది గైడ్. అదే సినిమాగా వచ్చింది. ఆ చిత్రం అనూహ్యమైన విజయాన్ని సాధించి పెట్టింది. ఎక్కడలేనంత పాపులారిటి వచ్చేలా చేసింది. దర్శకుడి ప్రతిభ..నటీ నటుల అమోఘమైన ప్రదర్శన..సంగీతం..పాటలు..ఇలా ప్రతి ఫ్రేమ్ లో ప్రజలు లీనమయ్యారు. సినిమా చూసేందుకు బారులు తీరారు. అనేకమైన అవార్డులు , పురస్కారాలు, ప్రశంసలు అందుకున్నారు. ఈ చిత్రానికి అంకురార్పణే ఒక కథ. దేవానంద్ హం దోనో సినిమా 1962లో బెర్లిన్ చలన చిత్రోత్సవానికి ..భారత దేశం తరపున అధికారిక చిత్రంగా ఎంపికైంది. గైడ్ ఆంగ్ల చిత్రానికి టాడ్ డేనియల్ దర్శకత్వం వహించాడు. చిత్ర అనువాదాన్ని పెర్ల్ ఎస్ బక్, టాడ్ డేనియల్ సంయుక్తంగా నిర్వహించారు. ఒకేసారి ఆంగ్ల, హిందీ చిత్రాల చిత్రీకరణ సాంకేతిక కారణాల వల్ల సాధ్యం కాక పోవడంతో మొదటగా ఇంగ్లీష్ మూవీని చిత్రీకరించారు. దీంతో హిందీ మూవీ మేకింగ్ ఆలస్యమైంది. అప్పటి దాకా దర్శకత్వం వహించిన చేతన్ ఆనంద్..తన స్వంత చిత్రం హకీకత్ కోసమని గైడ్ నుండి వైదొలగడంతో విజయ్ ఆనంద్ దర్శకత్వం వహించారు.
బారతీయ ప్రేక్షకులకు నచ్చేలా కొత్త చిత్రానువాదం చేశాడు. మనసు పెట్టి చేసిన ఈ సినిమా అనూహ్యమైన రీతిలో ..అసమాన్య విజయాన్ని నమోదు చేసుకుంది. భారతీయ సినిమా రికార్డులను తిరగ రాసింది. ఆ లోపు ఆంగ్ల సినిమా విడుదలైనా దానిని ఇక్కడి వారు ఆదరించలేదు. దేవానంద్ పని ఇక అయిపోయిందంటూ ప్రచారం చేశారు గిట్టనివారు. కానీ ఈ ఎవర్ గ్రీన్ హీరో ..మాత్రం తన స్టార్ డమ్ ను అమాంతం పెంచుకున్నాడు. ఢిల్లీలో ప్రదర్శించిన ఈ సినిమాను ప్రధానమంత్రి తప్ప అందరు మంత్రులు చూశారు. కొందరు అధికారులు నిల్చొని చూశారు. 1965 ఫిబ్రవరి 6న ఈ మూవీ విడుదలైంది. పంపిణీదారులు ఆసక్తి చూపించక పోయినా ..పబ్లిసిటీ పరంగా హైప్ రావడంతో క్యూకట్టారు. ప్రేక్షకులను టాకీసులకు రప్పించేలా చేశాయి.
విజయానంద్ అనువాదం, దర్శకత్వం, కథలో వైవిధ్యం..ఎస్ డీ బర్మన్ సంగీతం, వహిదా రెహమాన్ నృత్యాలు, దేవానంద్ అభినవ నటనా కౌశల్యం సమ్మోహితులను చేసింది. ఈ సినిమా ఒక కళా ఖండంగా మిగిలి పోయింది. ప్రేక్షకులు, అభిమానులు లెక్కకు మించి చూశారు. కాసుల వర్షం కురిపించారు. గైడ్ సంగీత దర్శకత్వం మినహాయిస్తే..మిగతా అన్ని శాఖలలోను ఫిల్మ్ ఫేర్ పరంగా ఉత్తమ బహుమతులను గెల్చుకుంది. చాలా రోజుల తర్వాత దూరదర్శన్‌లో ప్రదర్శించారు. దేశమంతటా అధిక శాతం టీవీకే అతుక్కు పోయారు. విదేశీ చిత్రాల కోవలో..ఆస్కార్ చిత్రోత్సవానికి ఇండియా తరపున అధికారిక చిత్రంగా దేవానంద్ గైడ్ ఎంపికైంది. 42 ఏళ్ల తర్వాత 2007లో కేన్స్ చిత్రోత్సవంలో ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. దేవానంద్, వహీదా ల నట జీవితంలో ఇదో కలికితురాయిగా నిలిచి పోయింది.
సినిమా రంగంలో అజరామరమైన కీర్తిని స్వంతం చేసుకుని..విలక్షణమైన నటుడిగా..సమున్నతమైన మానవుడిగా ఎదిగిన దేవానంద్‌కు ఎన్నో అవార్డులు, పౌరసత్కారాలు లభించాయి. భారత ప్రభుత్వం అత్యున్నతమైన పద్మభూషణ్ అవార్డుతో దేవానంద్ ను సత్కరించింది. సినిమా రంగంలో పేరొందిన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును 2001లో అందుకున్నారు. నాగపూర్ లో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశానికి దేవానంద్‌ను ప్రత్యేక అతిథిగా ఆహ్వానించారు. ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. నేషనల్ పార్టీ ఆఫ్ ఇండియా పేరుతో పార్టీని స్థాపించాడు. భారత్..పాకిస్తాన్ ల మధ్య బంధం బాగుండాలని తపన పడ్డాడు దేవానంద్. అప్పటి ప్రధాని వాజ్‌పేయ్ లాహోర్ బస్ యాత్రలో స్వయంగా పాల్గొన్నారు. లండన్‌లో గుండె పోటుతో 2011లో ఇక సెలవంటూ వెళ్లి పోయారు. అపురూపమైన రూపం..ముగ్ధ మనోహరమైన ఆహార్యం కలిగిన ఈ అరుదైన నటుడు ..మళ్లీ పుడితే బావుండేది..గాతా రహే మేరా దిల్ అంటూ ..వెళ్లిపోయినా..ఆ స్వర్గంలో ..తను నవ్వుకుంటూ..స్టయిల్‌గా పాడుకుంటూ వుంటారు. దేవానంద్ జీ...జీవితమంటే ప్రేమమయం కదూ..!
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి