ఖరారు కాని ముహూర్తం - ఎవరికి దక్కేనో అదృష్టం
తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువు తీరినా కేబినెట్ విస్తరణ జరగలేదు. ఎన్నికల ఫలితాలు వెలువడినా ఎవరికి చోటు దక్కుతుందో తెలియని అనిశ్చిత పరిస్థితి నెలకొంది. కొత్తగా ఏర్పాటయ్యే మంత్రివర్గంలో ఎవరెవరు ఉంటారన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఓ వైపు గ్రామ పంచాయతీల ఎన్నికలు ముగియడంతో అటు కేబినెట్ కొలువులతో పాటు నామినేటెడ్ పోస్టుల కోసం క్యూ మొదలైంది. ఊహించని రీతిలో భారీ ఎత్తున ప్రజలు గులాబీకి జై కొట్టడంతో ఎమ్మెల్యేల సంఖ్య పెరిగి పోయింది. పదవులకు సంబంధించి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల మధ్యే పోటీ నెలకొంది. గెలిచిన వారితో లెక్కిస్తే మొత్తం 16 మంత్రి పదవులు దక్కున్నాయి. గత కేబినెట్‌లో కొందరు ఓటమి చెందడం పార్టీ అధినేతకు ఆశ్చర్యానికి గురి చేసింది. కేసీఆర్‌కు ఆప్తుడిగా పేరొందిన తుమ్మల నాగేశ్వర్‌రావు, జూపల్లి కృష్ణారావులు ఓడి పోవడం పునరాలోచనలో పడేసింది.
ఎలాగైనా సరే తుమ్మలకు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టి తిరిగి మంత్రివర్గంలోకి తీసుకుంటారా లేక ఏదైనా పదవి ఇచ్చి ఎన్నికల్లో నిలబెడతారో వేచి చూడాల్సిందే. ఎవరికి చోటు కల్పించాలో ..ఎవరిని పక్కన పెట్టాలన్నది పరీక్షగా మారింది. సంఖ్యా శాస్త్రం ప్రకారం 10 మందితోనే సర్దుబాటు చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఎన్నడూ లేనంతగా మంత్రుల మధ్య విపరీతమైన పోటీ నెలకొంది. ఈనెల మూడు లేదా నాలుగో వారంలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అంతకంటే ముందు ఏదో ఒక మంచి ముహూర్తంలో కేబినెట్ విస్తరణ జరుగుతుందని పార్టీ వర్గాలు ఆశతో ఎదురు చూస్తున్నాయి. వేముల ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఈటెల రాజేందర్, హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, నీళ్ల నిరంజన్ రెడ్డి , లక్ష్మారెడ్డి, జగదీశ్‌రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, పద్మా దేవేందర్ రెడ్డి, పట్నంనరేందర్ రెడ్డిల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి.
ఎనిమిది మందితో సరిపెడతారా లేక ఇంకొందరికి చోటు కల్పిస్తారా వేచి చూడాలి. ముఖ్యమంత్రిగా కేసీఆర్, హోం శాఖ మంత్రిగా మహమూద్ అలీ ప్రమాణ స్వీకారం చేశారు. ఈసారి కేబినెట్‌లో మహిళకు చోటు కల్పిస్తారని ప్రచారం. వీరితో పాటు ఇంకొందరికి ఛాన్స్ దక్కనుంది. కొత్తగా రాష్ట్రం ఏర్పడినప్పుడు 11 మంది మొదట ప్రమాణ స్వీకారం చేయగా తర్వాత మరికొందరికి అవకాశం కల్పించారు. కేబినెట్ విస్తరణ తేదీ , మంత్రి పదవులు తొలి విడతలో ఎవరికి ఇవ్వాలనే విషయంలో ఒక నిర్ణయానికి వచ్చారని..ఇక ముహూర్త బలం కోసమే వేచి చూస్తున్నట్లు గులాబీ శ్రేణులు అంటున్నాయి. మంత్రివర్గ విస్తరణ విషయంలో అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు లేకపోలేదంటున్నారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెట్టేకంటే ముందే పదవులను కట్టబెట్టవచ్చు. లేకపోతే లోక్‌సభ ఎన్నికల తర్వాత ఒకేసారి పూర్తి స్థాయి కేబినెట్ కూర్పు ఉండవచ్చు.
పార్టీ పరంగా కార్యనిర్వాహక అధ్యక్షుడి హోదాలో ఉన్న కేటీఆర్ తో పాటు ట్రబుల్ షూటర్‌గా పేరొందిన తన్నీరు హరీష్ రావులకు కంపల్సరీగా చోటు దక్కనుండగా మిగతా వారిలో ఎవరెవరు ఉంటారనే దానిపై ఎడతెగని చర్చలు జరుగుతున్నాయి. నల్లగొండ నుండి గుత్తాను కేబినెట్‌లోకి తీసుకుంటే చెరుకు ముత్యం రెడ్డికి రైతు సమన్వయ సమితి అధ్యక్ష పదవి దక్కనుందని ఆ పార్టీ వర్గాలే అంటున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో పోటీ తీవ్రంగా ఉంది. ఉద్యోగ సంఘాల గౌరవ అధ్యక్షుడిగా ఉన్న శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, నీళ్ల నిరంజన్ రెడ్డిలు పదవుల రేసులో ముందంజలో ఉన్నారు. వీరిలో మొదటగా ఎవరికి ఏ పదవి దక్కుతుందో తెలియడం లేదు. రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో గౌడ్ గట్టి నమ్మకంతో ఉన్నారు. ఉద్యమ కాలం నుండి నేటి దాకా కేసీఆర్‌కు ఆప్తుడైన నీళ్ల నిరంజన్ రెడ్డికి కచ్చితంగా చోటు దక్కుతుందని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు. మరో వైపు కేటీఆర్, హరీష్‌లకు ఆత్మీయుడిగా పేరు తెచ్చుకున్న లక్ష్మారెడ్డి సైతం నమ్మకంగా ఉన్నారు. బుగ్గ కారు ఎవరిని వరిస్తుందో ...కేసీఆర్ కేబినెట్ కారులో ఎవరు కూర్చుంటారనేది కొద్ది రోజులు ఆగితే తేలుతుంది. అంత దాకా వేచి చూడటమే మిగిలింది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి