సినీ వెన్నెల .. సిరి వెన్నెల..!
తెలుగు సినిమా చేసుకున్న పుణ్యం ఆయన. గేయ రచయితగా అత్యున్నతమైన స్థానాన్ని అందుకున్న యోగి. కవి.రచయిత. నటుడు. భావుకుడు. ఏ సమయంలోనైనా రాయగల నేర్పు కలిగిన అరుదైన వ్యక్తి ..సినిమానే ఇంటి పేరుగా మార్చుకున్న సిరివెన్నెల సీతారామశాస్త్రి. ఆయన కలంలోంచి జాలువారిన ప్రతి అక్షరం తెలుగు వాకిట గవాక్షమై నిలిచి పోయింది. ఏది మాట్లాడినా..ఇంకేది రాసినా దానికో పద్ధతి..పరమార్థం ఉండేలా జాగ్రత్తపడ్డారు. ఆకాశమంత కీర్తి శిఖరాలను అందుకున్న ఈ అక్షర పితామహుడి సినీ ప్రస్థానంలో లెక్కలేనన్ని పురస్కారాలు..అవార్డులు..ప్రశంసలు. తనతో పాటు ఎందరినో గేయ రచయితలుగా తీర్చిదిద్దిన ఘనత కూడా ఆయనదే. అతిరథ మహారథులను తట్టుకుని తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పర్చుకున్న తీరు ప్రశంసనీయం. తీక్షణంగా చూసే కళ్లు. సమాజాన్ని చైతన్యవంతం చేసే దిశగా ఉండేలా ఎన్నో పాటలు రాశారు.
ఆయన స్పృశించని అంశమంటూ ఏదీ లేదు. బలపం పట్టి బామ్మ బళ్లో అ ఆ ఇ ఈ నేర్చుకుంటా అని రాసిన సిరివెన్నెల..నిగ్గదీసి అడుగు సిగ్గులేని జనాన్ని అంటూ ప్రశ్నించడం నేర్పాడు. ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి అంటూ సానుకూల దృక్ఫథాన్ని పాటల ద్వారా తెలియ చెప్పేందుకు ప్రయత్నం చేశారు. ఈ జీవితం ఎంత సంక్లిష్టమైనదో..ఎలాంటి ముఖాల ముసుగులను వేసుకుని నటిస్తున్నామో కుండ బద్దలు కొట్టినట్టు ఓ సందర్భంలో .. అప్పుడెప్పుడో ఆటవికం..మరి ఇప్పుడు ఆధునికం..యుగయుగాలుగా ఏం మృగాలకన్నా ఎక్కువ ఏం ఎదిగాం. రాముడిలా ఎదగగలం..రాక్షసుడుని మించగలం.రకరాలుగా మసుగులు వేస్తూ మరిచాం..ఎపుడో స్వంత ముఖం..వాస్తవాన్ని చెప్పారు.
పాటల తోటల వనమాలిగా ప్రసిద్ధి చెందిన సిరివెన్నెల సీతారామశాస్త్రి చేసిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం అత్యుత్తమమైన పురస్కారాన్ని ప్రకటించి..గౌరవించింది. విశాఖపట్టణం జిల్లా అనకాపల్లి మండలంలో 20 మే 1955లో జన్మించారు. ఉత్తమ విమర్శకురాలిగా తన భార్య పద్మావతిని పేర్కొంటారు. కవిగా కవిత్వం పండించారు. రచయితగా సాహిత్యానికి ప్రాణం పోశారు. పాటల రచయితగా తెలుగు వారి లోగిళ్లను పావనం చేశారు. గాయకుడిగా అలరించారు. నటుడిగా మెప్పించారు సిరివెన్నెల. పదవ తరగతి వరకు అనకాపల్లిలో చదివారు. కాకినాడలో ఇంటర్ పూర్తి చేశాడు. ఆంధ్ర విశ్వకళా పరిషత్తులో బీఏ పూర్తి చేసి..ఎంఏ చేస్తుండగా ప్రముఖ దర్శకుడు కాశీనాథుని విశ్వనాథ్ గారి కంట్లో పడ్డాడు. ఇంకేం అరుదైన కలం తన జూలు విదిల్చింది.
తెలుగుదనం నిండిన..తాత్వికత నిండిన పాటలు జాలు వారాయి. తన సినిమా సిరివెన్నెలకు తీసుకున్నారు. ఆ సినిమా విడుదలయ్యాక..పాటలే సినిమాకు ప్రాణమయ్యాయి. విజయం సాధించేందుకు దోహదపడ్డాయి. సీతారామశాస్త్రికి ముందు సిరివెన్నెలగా విశ్వనాథ్ మార్చేశారు. ఆ సినిమానే ఇంటి పేరైంది..అందరికీ ఇష్టమైన రచయితగా మార్చేసింది. ఓ వైపు పాటలు రాస్తూనే ..మరో వైపు తన సాహిత్య పరిజ్ఞానాన్ని పెంచుకుంటూనే ఉన్నారు. వయసు పెరిగిన కొద్దీ కొందరు అలాగే ఉండిపోతారు..కానీ సిరివెన్నెల సముద్రమంత హోరుతో పరుగులు తీస్తూనే ఉన్నారు. కొత్త దనంతో పోటీపడుతూనే హృదయాలను హత్తుకునేలా గీతాలు రాస్తున్నారు. 300 పాటలతో శివకావ్యం పేరుతో రాయడంలో నిమగ్నమయ్యారు.
విధాత తలపున ప్రభవించినది..అంటూ సిరివెన్నెల రాసిన మొదటి పాటే సినీ రంగాన్ని కుదిపేసింది. జనం గుండెల్లో గూడు కట్టుకునేలా మార్చేసింది. భావగర్భితమైన పాటగా పేరొందిన దీనిని రాసేందుకు ఓ వారం రోజులు పట్టిందని ఓ సందర్భంలో సిరివెన్నెల తెలిపారు. ధనం చేసే మాయను చిన్న చిన్న పదాలతో పాట కట్టగలరో..అదే సమయంలో దైవం చేసే మాయను కూడా చెప్పగలరు ఇదే ఆయనకున్న ప్రత్యేకత. సినీ వినీలాకాశంలో ఎన్ని తారలున్నా చల్లని జాబిలి వెలుగులు పంచుతూ తనకంటూ సుస్థిర స్థానాన్ని పదిలం చేసుకున్న ఘనత సిరివెన్నెలదే. లలిత గీతాలు రాయడంలో ఆయనకు ఆయనే సాటి. సాహిత్యంలోని ప్రక్రియలన్నింటిని ఉపయోగించారు. పాటల్లోకి తీసుకు వచ్చారు. సంగీత దర్శకులకు ఇబ్బంది లేకుండా వారు కోరుకున్న రీతిలో అందజేశారు.
కళ్లు సినిమాలో ఆయనే నటించి పాడిన పాట ఇప్పటికీ స్మరించుకునేలా ఉంటుంది. తెల్లారింది లేగండోయ్..కొక్కరకో ..మంచాలిగ దిగండోయ్..అంటూ ఆర్ద్రంగా పాడారు. రుద్రవీణలో రాసిన నమ్మకు నమ్మకు ఈ రేయిని..కమ్ముకు వచ్చిన ఈ మాయని..చాలా పాపులర్ సాంగ్‌గా నిలిచింది. సిరివెన్నెల కలం లోంచి జాలువారిన అనేక పాటల్లో ప్రతి పాట గుర్తుంచు కోదగినదే. లలిత ప్రియ కమలం విరిసినదీ అనే పాటకు జాతీయ అవార్డు అందుకున్నారు. స్వర్ణకమలం సినిమాలోని పాటలు హిట్‌గా నిలిచాయి. ఆకాశంలో హరివిల్లు..అందెల రవమిది..శృతిలయలులో తెలవారదేమో స్వామి..రాం గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన శివ సినిమాలోని బోటనీ పాటముంది..మ్యాటనీ ఆట ఉంది..దేనికో ఓటు చెప్పరా అంటూ హుషారైన పాట రాసి మెప్పించారు.
క్షణక్షణంలో కో అంటే కోటి..జాము రాతిరి జాబిలమ్మా..గాయంలో అలుపన్నది ఉందా..నిగ్గదీసి అడుగు..స్వరాజ్యమనలేని సురాజ్యమెందుకని..గులాబీలో ఏ రోజైతే చూశానో నిన్ను, క్లాసు రూంలో తపస్సు చేయుట వేస్టురా గురూ..ఈ వేళలో ఏం చేస్తు ఉంటావో..శుభలగ్నంలో చిలకా ఏ తోడు లేక..ఎటేపమ్మ ఒంటరి నడక..నిన్నే పెళ్లాడుతాలో కన్నుల్లో నీ రూపమే..సింధూరంలో అర్ధ శతాబ్ధపు అజ్ఞానాన్ని స్వరాజ్యమందామా..దేవీపుత్రుడులో ఓ ప్రేమా..చంద్రలేఖలో ఒక్కసారి నవ్వి చూడయ్యో, నువ్వే కావాలి మూవీలో ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది..కళ్లల్లోకి కళ్లు పెట్టి చూడవెందుకు, శుభసంకల్పంలో హైలెస్సో హైలెస్సా, సీతమ్మ అందాలూ..పట్టుదలలో ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి
అంటూ రాసిన పాటలన్నీ హిట్‌గా నిలిచాయి.
నీతోనే ఆగేనా సంగీతం, రండి రండి దయచేయండి అంటూ లలిత పదాలను పాటలుగా మలిచారు. 1986లో సినీ ప్రస్థానం ప్రారంభమైంది..నేటికీ నిరాటంకంగా కొనసాగుతోంది. ఆడదే ఆధారం, ఇల్లు ఇల్లాలు పిల్లలు, కళ్లు, పెళ్లి చేసి చూడు, శ్రీ కనక మహాలక్ష్మి రికార్డింగ్ ట్రూప్ , జయమ్ము నిశ్చయమ్మురా, స్వరకల్పన, సూత్రధారులు, అన్న తమ్ముడు, అల్లుడుగారు, బొబ్బిలిరాజా, చెవిలో పువ్వు, ఆదిత్య 369, కలికాలం సినిమాలకు పాటలు రాశారు. కూలీ నెం 1లో కొత్త కొత్తగా ఉన్నది..స్వర్గమిక్కడే అన్నది , రౌడీ అల్లుడులో చిలుకా క్షేమమా , క్షణక్షణంలో జామురాతిరి జాబిలమ్మ, అమ్మాయి ముద్దు ఇవ్వందే, అందనంత ఎత్తా తారా తీరం సాంగ్స్ పాపులర్ అయ్యాయి. గోపాల్ డైరెక్షన్‌లో వచ్చిన అసెంబ్లీ రౌడీ, వంశీ ఏప్రిల్ 1 విడుదల, ఆపద్బాంధవుడు, పట్టుదల, పరువు ప్రతిష్ట, స్వాతి కిరణంలోని ప్రణతి ప్రణతి, శివానీ భవానీ సాంగ్స్, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు డైరెక్షన్‌లో వచ్చిన అల్లరి ప్రియుడు పాటల్ హిట్..అహో ఒక మనసుకు నేడే పుట్టిన రోజు, మనీ వారెవా ఏమి ఫేసు, మేజర్ చంద్రకాంత్, రక్షణ, నిప్పురవ్వ, అంతం సినిమాలో ఓ మైనా, నీ నవ్వు చెప్పింది నాతో, గోవిందా గోవిందా లో అమ్మ బ్రహ్మదేవుడో, నంబర్ వన్, భైరవ ద్వీపం సినిమాలకు పాటలు రాశారు.
ఘాటైన ప్రేమ ఘటన సాంగ్ హిట్‌గా నిలిచింది. ముద్దుల ప్రియుడు, యమలీల, ప్రియరాగాలు, మనీ మనీ , క్రిమినల్ సినిమాలకు రాయగా తెలుసా మనసా పాట మోస్ట్ పాపులర్ పాటగా ఆల్ టైం రికార్డు సాధించింది. సిసింద్రి, పెదరాయుడు, సొగసు చూడతరమా, అనగనగా ఒక రోజు, లవ్ బర్డ్స్, మావిచిగురు మూవీస్‌కు పాటలు రాశారు. పవిత్ర బంధం సినిమాలో అపురూపమైనదమ్మ ఆడజన్మ సాంగ్ ఆకట్టుకుంది. ఉప్పలపాటి మైనా, గంగరాజు లిటిల్ సోల్జర్స్ కు సరేలే ఊరుకో, వజ్రం పాటలతో మెప్పించారు. కృష్ణ వంశీ డైరెక్షన్‌లో వచ్చిన నిన్నే పెళ్లాడుతా మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది. ఎటో వెళ్లి పోయింది మనసు ఇలా వంటరైంది వయసు..అంటూ రాసిన పాట హైలెట్. గ్రీకువీరుడు నా రాకుమారుడు, కన్నుల్లో నీ రూపమే, ఇంకా ఏదో, నాతోరా సాంగ్స్ హైలెట్. శ్రీకారం, అక్కుమ్ బుక్కుమ్, సంప్రదాయం, రాముడొచ్చాడు, శ్రీకృర్జున విజయం సినిమాలకు గీతాలు రాస్తే..వైఫ్ ఆఫ్ వరప్రసాద్ సినిమాలో ఆయన రాసిన ఎక్కడికి ఈ పరుగు హిట్ సాంగ్ గా పాపులర్ అయింది.
కోడి రామకృష్ణ డైరెక్షన్‌లో వచ్చిన పెళ్లిలో జాబిలమ్మ నీకు అంత కోపమా మెలోడీ సాంగ్ హైలెట్. వీరు కె డైరెక్షన్‌లో వచ్చిన ఆరోప్రాణం, ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించిన గోకులంలో సీత సినిమాకు పొద్దే లేని లోకం నీది, గోకులకృష్ణ గోపాలకృష్ణ ఆటలు చాలయ్యా సాంగ్ ఆదరణ పొందాయి. తారకరాముడు మూవీకి అన్ని పాటల్ని సిరివెన్నెలే రాశారు. దేవుడు, శుభముహూర్తం, వీడెవడండి బాబూ మూవీస్‌కు పాటలు రాస్తే..వెంకటేశ్ నటించిన ప్రేమించుకుందాం రా మూవీ సాంగ్స్ పాపులర్‌గా నిలిచాయి. మేఘాలే తాకింది, అలా చూడు ప్రేమ లోకం సాంగ్స్ టాప్ టెన్‌లో నిలిచాయి. ఎస్వీ క్రిష్నారెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఆహ్వానం మూవీ సాంగ్స్ ఇప్పటికీ వింటున్నారు జనం. దేవతలారా రండి..మనసా మాటాడమ్మా, పందిరి వేసిన ఆకాశానికి అంటూ సిరివెన్నెల రాసిన పాటలు సాహిత్యానికే హైలెట్‌గా నిలిచాయి. చిన్నబ్బాయి, ఆవిడా మా ఆవిడే, ప్రేమతో, సూర్యవంశం, గణేష్, ఊయలలో జరిగినదంతా నిజమని అనే సాంగ్ ఆకట్టుకుంది. శ్రీ సీతారాముల కళ్యాణము చూతము రారండి, ఆహా సినిమాలకు రాశారు.
కృష్ణవంశీ దర్శకత్వం వహించిన అంతఃపురం మూవీలో సిరివెన్నెల రాసిన పాటలు అర్ధవంతంగా ఉన్నాయి. సూరీడు పువ్వా, అసలేం గుర్తుకురాదు, కళ్యాణం కానుంది అనే సాంగ్స్, రాజా మూవీలో ఏదో ఒక రాగం పాట పాపులర్. మా బాలాజీ, సీతారామరాజు, శ్రీను , మనసులో మాట, నా హృదయంలో నిదురించే చెలి సినిమాలకు గీతాలు రాసారు. ప్రేమకథ మూవీకి ఆయన రాసిన దేవుడు కరుణిస్తాడని అనే సాంగ్ సినిమాకు హైలెట్‌గా నిలిచింది. ప్రేమంటే ఇదేరా, ఆజాద్, చిరునవ్వుతో, నువ్వే కావాలి, ఒకే మాట, జయం మనదేరా, చూసొద్దాం రండి, సర్దుకు పోదాం రండి, శ్రీ శ్రీమతి సత్యభామ, నిన్నే ప్రేమిస్తా, అంతా మన మంచికే, నువ్వు వస్తావని సినిమాలకు రాసిన పాటలు పాపులర్‌గా నిలిచాయి. మురారి సినిమా హిట్‌గా నిలిస్తే..అందులో సిరివెన్నెల రాసిన పాటలన్నీ హైలెట్. రాయలసీమ రామన్న చౌదరి సినిమాలు సక్సెస్ అయ్యాయి. ఆనందం మూవీకి రాసిన పాటలు కనులు తెరిచినా , ఎవరైనా ఎప్పుడైనా సాంగ్స్, మనసంతా నువ్వే, నువ్వు నాకు నచ్చావ్ మూవీస్‌లోని సాంగ్స్ ఆకాశం దిగి వచ్చి, నా చూపే నిను, ఒక్కసారి చెప్పలేవా, ఓ నవ్వు చాలు, ఉన్నమాట చెప్పనీవు పాటలు ఆకట్టుకున్నాయి.
ప్రేమతో రా, అమ్మాయి కోసం, వేచి వుంటా, బావ నచ్చాడు, ఎదురులేని మనిషి, వాసు కరుణాకరన్, ఒక్కడు, ఓ చినదాన, సంతోషం, అల్లరి రవిబాబు, మనసుంటేచాలు, లాహిరి లాహిరి లాహిరిలో , డాడీ, వసంతం, ఎలా చెప్పను సినిమాల పాటలు హిట్. నాగార్జున నటించిన మన్మధుడులోని పాటలన్నీ హిట్. సింహాద్రి, గుడుంబా శంకర్, వర్షం మూవీలోని ఎన్నాళ్లకొచ్చావే వాన అనే సాంగ్ ఇప్పటికీ ఎక్కడో ఓ చోట వినిపిస్తుంది. శ్రీ ఆంజనేయం, ఆర్య, నువ్వొస్తానంటే నేనొద్దంటానా పాటలు హిట్. కృష్ణవంశీ డైరెక్షన్‌లో వచ్చిన చక్రం మూవీ కోసం రాసిన జగమంత కుటుంబం నాది..అనే సాంగ్ మోస్ట్ పాపులర్ సాంగ్‌గా నిలిచింది. ఇక సంక్రాంతి, హ్యాపీ, శివ డబ్బింగ్ మూవీతో పాటు సుకుమార్ తీసిన బొమ్మరిల్లు, ఆట, చిరుత, క్లాస్ మేట్స్, ఒక్కడున్నాడు, ఆడవారి మాటలకు అర్థాలు వేరులే, అతిథి, విశాఖ ఎక్స్ ప్రెస్, వాన, పరుగు, హరే రామ్, గమ్యం, జల్సా, ఛలోరే, యు అండ్ ఐ, కంత్రి, రెడీ , అష్టాచెమ్మా, కొత్త బంగారు లోకంలోని నేననీ నీవని అనే సాంగ్స్ గొప్ప సాంగ్స్ గా పేరు తెచ్చుకున్నాయి.
శశిరేఖా పరిణయం, మహాత్మా , కిక్, అలా ఎలా ..అంటూ వందలాది పాటలకు ప్రాణం పోశారు సిరివెన్నెల. ఆయన రాసిన పాటలకు ఎన్నో అవార్డులు అందుకున్నారు. వాటిలో సిరివెన్నెలో విధాత తలపున, శృతిలయలు తెలవారదేమో స్వామి, స్వర్ణకమలం అందెల రవమిది, గాయం సురాజ్యమవలేని, శుభలగ్నం చిలకా ఏతోడు లేక, శ్రీకారం మనసు కాస్త కలత, సిందూరం అర్దశతాబ్దపు, ప్రేమకథ దేవుడు కరుణిస్తాడని, చక్రం జగమంత కుటుంబం నాది, గమ్యం ఎంత వరకు ఎందుకొరకు అనే సినిమాల్లోని పాటలకు రాష్ట్ర స్థాయిలో అవార్డులు, కళాసాగర్ పురస్కారాలు సిరివెన్నెల అందుకున్నారు. అంకురం, పెళ్లి సందడి సినిమాలకు పేరొచ్చింది. హృదయమనే కోవెల తలుపులు తెరిచే తాళం ప్రేమా ప్రేమా అనే సాంగ్‌కు మనస్విని పురస్కారం అందుకున్నారు. మనిసిచ్చి చూడులో బోడి చదువులు వేస్టు నీ బుర్రంతా ఖాళీ చేస్తూ , అల్లుడుగారు సినిమాలోని నోరార పిలిచినా పలకనివాడినా, మనసున మమతలున్న మనిషిని కానా అనే పాటకు ఉత్తమ గేయ రచయితగా అవార్డు కు ఎంపికయ్యారు. మనసులో మాట మూవీకి గాను ఏ రాగముంది మేలుకుని ఉండి లేవనంటుందా మనసుని పిలవగా , భారతరత్న మూవీ కోసం రాసిన మేరా భారత్ కో సలాం..ప్యారా భారత్ కో ప్రణాం అనే సాంగ్ కు పురస్కారం లభించింది.
భారతరత్నలోని పారా హుషార్, నువ్వు వస్తావని సినిమాకు రాసిన పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి సాంగ్స్ రాసినందుకు గాను వంశీ బర్కిలీ పురస్కారం అందుకున్నారు. నువ్వే కావాలి సినిమాకు గాను ఉత్తమ గేయ రచయితగా రసమయి అవార్డు దక్కింది. కళ్లు సినిమాకు గాను బుల్లి తెర పురస్కారం, తులసీదళం టీవీ సీరియల్‌కు గాను రాసిన హాయిగా వుంది, నిదురపో గీతాలు రాసినందుకు ప్రశంసలు అందుకున్నారు. 34 ఏళ్ల సినీ ప్రస్థానంలో సిరివెన్నెల ప్రయోగించని పదమంటూ లేదు. వందలకొలది రాసిన ప్రతి పాటా ఎన్నదగినదే..మనసుకు సాంత్వన చేకూర్చి..గుండెల్లో పది కాలాల పాటు దాచుకునేలా పాటలను రాసిన సిరివెన్నెల ధన్యుడు. ఆయన తెలుగు వాకిట పాటల తోరణం కట్టారు. కావాల్సిందల్లా ఓపికతో మళ్లీ వింటూ ఉండడమే. జీవితం ఆనందమయమే. కదూ..!
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి